Yuvagalam: మూడు నెలలు ఓపిక పట్టండి, టీడీపీ ప్రభుత్వం వస్తుందన్న నారా లోకేష్
Yuvagalam: ఏపీ ప్రజలు మరో మూడు నెలలు ఓపిక పడితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నారా లోకేష్ అన్నారు. వడ్డీతో సహా అన్నీ తిరిగి చెల్లిస్తామని యువగళంలో ప్రకటించారు. రాజోలులో ఉన్నా రష్యాకు పారిపోయినా తీసుకొస్తామన్నారు.
Yuvagalam: టీడీపీ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర దాదాపు రెండున్నర నెలల తర్వాత తిరిగి ప్రారంభమైంది. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ కావడంతో సెప్టెంబర్ 9వ తేదీన లోకేష్ పాదయాత్ర నిలిచిపోయింది. ఇప్పటి వరకూ 209 రోజుల పాటు 2852.4 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. రెండున్నర నెలల తర్వాత పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.
రాజోలు నియోజకవర్గం పొదలాడ క్యాంప్ సైట్ నుండి 210 వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా టిడిపి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పొదలాడ చేరుకున్నారు.
పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుండే జగన్ అడ్డుకోవడానికి స్కెచ్ లు వేసాడని లోకేష్ ఆరోపించారు. పోలీసుల్ని పంపాడని, పిల్ల సైకోలను పంపినా తగ్గేదే లేదు అన్నామని, మైక్ లాక్కున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదని, సాగనిస్తే పాదయాత్ర... అడ్డుకుంటే దండయాత్ర అవుతుందని చెప్పానన్నారు.
యువగళం వాలంటీర్ల మీద కేసులు పెట్టరని, నాయకుల మీద కేసులు పెట్టారని, తన మీద కేసులు పెట్టినా యువగళం ఆగలేదన్నారు.ఆఖరికి మన చంద్రబాబుని అరెస్ట్ చేసి యువగళం పాదయాత్ర ఆపాడని మండిపడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే సైకోకి భయం. అందుకే అక్రమంగా అరెస్ట్ చేసాడని ఆరోపించారు.
మరోమూడు నెలల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని లోకేష్ ప్రకటించారు. రాజారెడ్డి రాజ్యాంగం పనైపోయిందని... అంబేద్కర్ గారి రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. 80 ఏళ్ల కార్యకర్త కూడా బెదిరింపులకు భయపడకుండా తొడకొట్టి సవాల్ చేస్తారని, దట్ ఈజ్ టిడిపి పవర్ అన్నారు.
మూడు నెలలు ఓపిక పడితే టిడిపి కార్యకర్తల్ని వేధించిన వైసిపి వారికి వడ్డీ తో సహా చెల్లిస్తానన్నారు. రాజోలు లో ఉన్నా రష్యా పారిపోయినా తీసుకొచ్చి లోపలేస్తా అన్నారు.
పాదయాత్ర షెడ్యూల్…
210 వ రోజుకు సంబంధించిన వివరాలు..
10.19 గంటలకు రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం
11.20 గంటలకు తాటిపాక సెంటర్‌లోని బహిరంగసభలో లోకేష్ ప్రసంగం
12.35 గంటలకు పి.గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశం నగరంలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో ముఖాముఖి
మధ్యాహ్నం 2 గంటలకు మామిడికుదురులో స్థానికులతో సమావేశం
2.45 గంటలకు పాశర్లపూడిలో భోజన విరామం
సాయంత్రం 4 గంటలకు పాశర్లపూడి నుంచి పాదయాత్ర కొనసాగింపు
4.30 గంటలకు అప్పనపల్లి సెంటర్‌లో స్థానికులతో సమావేశం
5.30 గంటలకు అమలాపురం నియోజకవర్గంలో ప్రవేశం, స్థానికులతో మాటామంతీ
6.30 గంటలకు బోడసకుర్రులో మత్స్యకారులతో ముఖాముఖి
7.30 గంటలకు పేరూరులో రజక సామాజికవర్గీయులతో భేటి
7.45 గంటలకు పేరూరు శివారు విడిది కేంద్రంలో బస