విశాఖ నగర పరిధి రుషికొండ, మధురవాడ ఐటీ పార్క్‌లోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్(Sify Infinit Spaces Limited) ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్.. ప్రభుత్వం కేటాయించిన 3.6 ఎకరాల భూమిలో రూ.1,500 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయనుంది. తద్వారా వెయ్యిమందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడారు. పెట్టుబడులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు.
'సూపర్ సిక్స్‌లో భాగంగా 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం మా లక్ష్యం. అయితే ఐటీ మంత్రిగా విశాఖలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలని టార్గెట్ పెట్టుకున్నాను. టీసీఎస్ తక్కువ ధరకు భూముల కేటాయింపుపై కొంతమంది కోర్టుకు వెళ్లారు. టీసీఎస్‌కు కేటాయించిన తర్వాత పలు పెద్ద సంస్థలు ఏపీకి క్యూ కట్టాయి. రాష్ట్రంలో పరిశ్రమలకు ఉత్తమ విధానాలు కల్పిస్తున్నాం.' అని నారా లోకేశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అజెండాకు ప్రధాని మోదీ, కేంద్రం సహకారం ఉందని లోకేశ్ పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు.. బుల్లెట్ రైలులా దూసుకెళ్తోందన్నారు. కేంద్రం చేసే సంస్కరణల్లో ఏపీకి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంటు 80 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని చెప్పారు. పూర్తి సామర్థ్యంతో పని చేసేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధికి 30 సంవత్సరాలు పట్టిందని, కానీ విశాఖకు పది సంవత్సరాలు చాలు అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ స్థాయిలో విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. విశాఖలో పెట్టుబడులపై 3 నెలల్లో మరికొన్ని ప్రకటనలు వస్తాయని చెప్పారు. అనవసరంగా చేసే రాజకీయ, అధికార పొరపాట్లతో పెట్టుబడులు వెనక్కు పోకూడదని అన్నారు. అలా చేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లకూడదన్నారు. విశాఖను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ రాజధానిగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
2047 నాటికి విశాఖ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు లోకేశ్. పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఏపీ సరైన గమ్యస్థానం అన్నారు. పెట్టుబడుల సాధనలో చరిత్ర తిరగరాస్తామనని నమ్మకం ఉందన్నారు. ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయని ప్రకటించారు. ఇందులో 50 శాతం విశాఖకే రానున్నట్టుగా తెలిపారు.