Mangalagiri : మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు.. సీఎస్ఆర్ కింద ఇచ్చిన మేఘా-nara lokesh launches free electric bus services in mangalagiri ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mangalagiri : మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు.. సీఎస్ఆర్ కింద ఇచ్చిన మేఘా

Mangalagiri : మంగళగిరిలో ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలు.. సీఎస్ఆర్ కింద ఇచ్చిన మేఘా

HT Telugu Desk HT Telugu

Mangalagiri : మంగ‌ళ‌గిరిలో ఉచిత ఎల‌క్ట్రిక్ బ‌స్సు సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. రెండు స‌ర్వీసులు అందుబాటులోకి రాగా.. అందులో ఒక‌టి ఎయిమ్స్‌కు, మ‌రొకటి పాన‌కాల ల‌క్ష్మీనర‌సింహస్వామి ఆల‌యానికి రాక‌పోక‌లు నిర్వ‌హిస్తున్నాయి. రెండు ఉచిత ఎలక్ట్రిక్ బస్సు సేవలను మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు.

బస్సులను ప్రారంభిస్తున్న మంత్రి లోకేష్

సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు, భ‌క్తులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి వచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సీఎస్ఆర్) నిధుల నుంచి బస్సులను సమకూర్చాలని.. మేఘా కంపెనీని మంత్రి లోకేష్ కోరారు. లోకేష్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన.. మేఘా.. రూ.2.4 కోట్ల విలువైన రెండు అత్యాధునిక ఒలెక్ట్రా 7 మీటర్ల ఎలక్ట్రిక్ బస్సులను అందజేసింది.

బస్టాండు నుంచి..

ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డీజీపీ ఆఫీసు మీదుగా ఎయిమ్స్‌కు రాక‌పోక‌లు నిర్వ‌హిస్తోంది. మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడి వరకు రాక‌పోక‌లు నిర్వ‌హిస్తోంది. ఎయిమ్స్‌కు వెళ్లే బస్సు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. పానకాలస్వామి ఆలయానికి వెళ్లే బస్సు ఉదయం 7 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రయాణికులకు ఉచితంగా సేవలందిస్తుంది.

అత్యాధునిక సౌకర్యాలతో..

ప్రతి బస్సు 18 మంది ప్రయాణికుల సామర్థ్యంతో.. ఒకసారి ఛార్జింగ్‌తో 150 కిలో మీట‌ర్ల‌ వరకు నడగలదు. ఈ బస్సులు ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ (ఈహెచ్‌పీఎస్‌), రియల్-టైమ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్స్ (వీటీఎస్‌), రివర్స్ పార్క్ అసిస్ట్ సిస్టమ్స్ (ఆర్‌పీఏఎస్‌) వంటి అత్యాధునిక సౌకర్యాలతో భద్రతా ప్రమాణాలు కలిగి ఉంటాయి. ఈ స‌ర్వీసుల రాక‌తో భ‌క్తులకు, సాధార‌ణ ప్ర‌యాణికుల‌కు ప్ర‌యోజనం కలగనుంది.

ప్రయాణించిన లోకేష్..

మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన త‌రువాత.. ఆయ‌న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్, ఎయిమ్స్ డైరక్టర్ శాంతా సింగ్, డిప్యూటీ డైరక్టర్ శశికాంత్, లక్ష్మీనరసింహస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.కోటిరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ నేత‌ల‌తో క‌లిసి బ‌స్సులో ప్ర‌యాణించారు. బ‌స్సుల‌ను అందించిన మేఘా కంపెనీ వాళ్ల‌ను బ‌స్సుల‌కు సంబంధించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

ఇతర ప్రాంతాల్లోనూ..

బస్సులు రావడంపై మంగ‌ళ‌గిరి వాసులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఎయిమ్స్‌కు వెళ్లే రోగులు, సిబ్బంది సౌక‌ర్య‌వంత‌మైన ఈ బ‌స్సు స‌ర్వీసును స‌ద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి నారా లోకేష్ కోరారు. అలాగే పాన‌కాల లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యానికి వెళ్లే భ‌క్తులకు అసౌక‌ర్యం త‌లెత్త‌కుండా ఉండేందుకు ఈ బ‌స్సును అందుబాటులోకి తెచ్చామ‌ని చెప్పారు. ఈ స‌ర్వీసుల‌ను వినియోగించుకోవడంతో వ‌చ్చిన ఫీడ్‌బ్యాక్‌తో.. ఇత‌ర ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచ‌న చేస్తామ‌ని స్పష్టం చేశారు.

(రిపోర్టింగ్- జ‌గదీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.