Nara Lokesh : భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి.. నారా లోకేష్ సీరియస్!
Nara Lokesh : మంత్రి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కొందరు ఉపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై లోకేష్ సీరియస్ అయ్యారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కావొద్దని వార్నింగ్ ఇచ్చారు.
జనవరి 23వ తేదీన మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. కొందరు అభిమానులు రక్తదానం చేశారు. మరికొన్నిచోట్ల రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. కానీ.. కొందరు మాత్రం హద్దులు దాటి ప్రవర్తించారు. అలాంటి వారిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయుల అత్యుత్సాహం..
లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం జట్పీ స్కూల్ ఉపాధ్యాయులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పాఠశాల విద్యార్థులను "హ్యాపీ బర్త్‌డే లోకేష్ సార్" అనే కూర్పులో కూర్చోబెట్టారు. దీన్ని డ్రోన్ ద్వారా వీడియో తీయించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఈ ఇష్యూపై మంత్రి లోకేష్ ట్విట్టర్ ద్వారా స్పందించారు.
మనస్తాపానికి గురయ్యా..
'రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా.. ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరుతున్నాను' అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
జగన్ ఇంటి ముందు..
అటు పార్టీ కార్యకర్తలు కూడా హద్దులు మీరి ప్రవర్తించడంపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. లోకేష్ బర్త్ డే సందర్భంగా కొందరు టీడీపీ కార్యకర్తలు తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గరకు వెళ్లారు. అక్కడ రోడ్డుపై కార్లు, బైక్‌లతో హారన్ కొట్టారు. జగన్ ఇంటి ముందే కార్లను ఆపి హడావుడి చేశారు. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై లోకేష్ సీరియస్ అయినట్టు తెలిసింది.
ఇలా చేయొద్దు..
ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేయొద్దని నాయకులను మందలించినట్టు సమాచారం. అభిమానం ఉంటే సేవా కార్యక్రమాలు చేపట్టాలని.. ఇలా విమర్శలకు దారితీసే పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. మరోసారి ఇలాంటి పనులు చేస్తే.. క్రమశిక్షణ చర్యలు తప్పవని లోకేష్ హెచ్చరించినట్టు టీడీపీ నేత ఒకరు చెప్పారు. జగన్ ఇంటి ముందు జరిగిన ఘటనపై అటు రాష్ట్ర పార్టీ నాయకత్వం కూడా ఆరాతీసినట్టు తెలిసింది.