Gannavaram TDP Incharge: కృష్ణాజిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ బాధ్యతల్ని యార్లగడ్డ వెంకట్రావుకు అప్పగించారు. గన్నవరంలో సాగుతున్న యువగళం పాదయాత్రలో చంద్రబాబు నిర్ణయాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ ప్రకటించారు. గన్నవరంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేశ్ సమక్షంలో వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార బ్యాంక్ సభ్యులు, ఇతర నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గన్నవరం పార్టీ ఇన్‌ఛార్జ్‌గా వెంకట్రావును నియమించినట్లు లోకేశ్ తెలిపారు.
రాష్ట్రంలో తొమ్మిది నెలల తర్వాత టీడీపీ అధికారంలోకి రాబోతోందని, వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయమని నారా లోకేశ్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసులతో వైసీపీ ప్రభుత్వం తమ నేతలను వేధిస్తోందని, తనపైనా హత్య కేసు సహా 20 కేసులు పెట్టారని తెలిపారు.
కృష్ణా జిల్లాలో తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వంశీ, కొడాలి నానిని ఓడించడానికి కార్యకర్తలంతా కసితో ఉన్నారని, వారికి రాజకీయ సమాధి కడతామని లోకేశ్ చెప్పారు. 2019లో గెలిచాక వెళ్లిపోయిందే కాక పార్టీ కార్యాలయంపై వంశీ దాడికి పాల్పడ్డారన్నారు.
పార్టీ మారే రెండ్రోజుల ముందూ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పట్టిసీమ లేకపోతే మరుగుదొడ్డిలో వాడుకునేందుకు నీళ్లూ ఉండేవి కావని అన్నారని గుర్తు చేశారు. ఆయన వల్ల నాలుగేళ్లుగా పార్టీ శ్రేణులు ఇబ్బంది పడ్డాయని చెప్పారు. . ఎవరిపై ఎక్కువ కేసులుంటాయో.. వారికి నామినేటెడ్ పోస్టులిస్తామన్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకరరెడ్డిపై ఇప్పటికే 74 కేసులు పెట్టారని, వాటిని 100కు పెంచుకుంటానంటూ ఆయన చెప్పడం టీడీపీ నేతల ధైర్యానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.
గన్నవరంలో కష్టకాలంలో పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించిన దివంగత బచ్చుల అర్జునుడు కృషి చేశారంటూ లోకేష్ గుర్తు చేసుకున్నారు.ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. టీడీపీకి కంచుకోటలాంటి సీట్లు చాలా ఉన్నా, కష్టమని తెలిసీ మంగళగిరి ఎంచుకున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో గెలిచి చూపిస్తామని సవాలు చేశారు.
కంచుకోటల్లో గెలిస్తే గొప్పేముందని ఎప్పుడూ తెదేపా గెలవని సీటు నాకు ఇవ్వండి.. గెలిచి చూపిస్తానని కోరానన్నారు. మంగళగిరిలో టీడీపీ రెండుసార్లే గెలిచిందని, జగన్ మాదిరిగా పులివెందులలో పోటీ చేసి గెలవడంలో గొప్పేముందని ఓడినా ఎక్కడికీ పోలేదన్నారు. యువగళం పాదయాత్రకు మంగళగిరిలో వచ్చిన స్పందన సాక్ష్యమన్నారు. ప్రతిక్షణం కార్యకర్తలకు అందుబాటులోనే ఉంటున్నానన్నారు. వైసీపీ కార్యకర్త చనిపోతే రూపాయి ఇవ్వరని టీడీపీలో కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటికే రూ.100 కోట్లు వెచ్చించామన్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి కోసం తామంతా కలసి కట్టుగా పనిచేస్తామని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. టీడీపీ కంచుకోటలో పసుపు జెండా ఎగురవేస్తామని చెప్పారు. ఆత్మాభిమానంతోనే తాను టీడీపీలో చేరానన్నారు. వంశీ వైసీపీకి మద్దతు ప్రకటించినా టీడీపీ శ్రేణులు ఆయన వెంట వెళ్లలేదని చెప్పారు. తాము రౌడీయిజం చేయడానికి రాలేదని.. రాజకీయం కోసమే వచ్చామన్నారు. కొత్త, పాత కలయికల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్తానని వెంకట్రావు చెప్పారు. ఏ ఒక్కరికి సమస్య ఉన్నా నేరుగా తనకి చెప్పాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.