Nandyal : నంద్యాల జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పుట్టింట్లో ఉన్న భార్యను చూసేందుకని ఏకంగా ఆర్టీసీ బస్సును లారీ డ్రైవర్ మద్యం మత్తులో చోరీ చేశాడు. బస్సు వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లటం, అలాగే ఇతర వాహనాలకు సైడ్ ఇవ్వకపోవడంతో పోలీసులు బస్సును ఆపి, ఆ లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ ఘటన శనివారం నంద్యాల జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దరగయ్య అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన భార్య పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలోని పుట్టింటికి వెళ్లింది. ఆమెను చూసేందుకు ముచ్చుమర్రికి దరగయ్య శనివారం బయలు దేరాడు. శనివారం తెల్లవారుజామున ఆత్మకూరు బస్ కాంప్లెక్స్‌కు దరగయ్య చేరుకున్నాడు. అయితే కాంప్లెక్స్‌లో ఆ సమయంలో బస్సులు లేవు.
అప్పటికే మద్యం సేవించి ఉన్న దరగయ్య, ఆత్మకూరు పట్టణ శివారులో ఆర్టీసీ అద్దె బస్సు నిలిపి ఉండటం చూసి అక్కడకు చేరుకున్నాడు. ఆర్టీసీ బస్సు ఎక్కి అందులో ఉన్న తాళం చెవిని వెతికి తీసుకున్నాడు. వెంటనే బస్సును స్టార్ట్ చేసి ముచ్చుమర్రికి బయలుదేరాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. దరగయ్య బస్సు తీసుకెళ్లడం ఎవరూ గమనించలేదు.
ఆ తర్వాత బస్సు డ్రైవర్ బస్సు నిలిపిన చోటు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ బస్సు లేపోవడాన్ని గమనించి, బస్సు యజమాని హరికృష్ణకు వెంటనే ఫోన్ చేసి విషయాన్ని తెలిపాడు. దీంతో బస్సు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నంద్యాల మార్గంలో వెళ్లాల్సిన బస్సు నందికొట్కూరు వైపు వెళ్లడం, అలాగే వెనక వచ్చే వాహనాలకు సైడ్ ఇవ్వకపోవడాన్ని ఇతర బస్సు డ్రైవర్లు గమనించారు. వారికి అనుమానం వచ్చి బస్సు యజమాని హరికృష్ణకు సమాచారం ఇచ్చారు.
వెంటనే బస్సు పగిడ్యాల వైపు వెళ్తోందని తెలుసుకున్న యజమాని పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముచ్చుమర్రి వద్ద బస్సును ఆపారు. దరగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి దరగయ్యను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. మద్యం మత్తులో మతిస్థిమితం లేక గతంలోనూ లారీలను తీసుకెళ్లేవాడని బంధువులు పోలీసులకు తెలిపారు. అలాగే బస్సు యజమాని హరికృష్ణ ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో దరగయ్యను పోలీసులు హెచ్చరించి పంపేశారు. దీంతో కథ సుఖాంతం అయింది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం