Nandyal Accident : నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం- గ్యాస్ సిలిండ‌ర్ పేలి కుప్పకూలిన ఇల్లు, ఇద్దరు మృతి-nandyal gas cylinder blast house collapse two dead nine injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nandyal Accident : నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం- గ్యాస్ సిలిండ‌ర్ పేలి కుప్పకూలిన ఇల్లు, ఇద్దరు మృతి

Nandyal Accident : నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం- గ్యాస్ సిలిండ‌ర్ పేలి కుప్పకూలిన ఇల్లు, ఇద్దరు మృతి

HT Telugu Desk HT Telugu
Jan 28, 2025 04:56 PM IST

Nandyal Accident : నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.

నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం- గ్యాస్ సిలిండ‌ర్ పేలి కుప్పకూలిన ఇల్లు, ఇద్దరు మృతి
నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం- గ్యాస్ సిలిండ‌ర్ పేలి కుప్పకూలిన ఇల్లు, ఇద్దరు మృతి

Nandyal Accident : నంద్యాల జిల్లాల‌లో తీవ్ర విషాదం నెల‌కొంది. గ్యాస్ సిలిండ‌ర్ పేలి ఏకంగా ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు అక్కడిక‌క్కడే మృతి చెంద‌గా, తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టారు. క్షత‌గాత్రుల‌ను వైద్యం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతదేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

yearly horoscope entry point

నంద్యాల మండ‌లం చాపిరేవు గ్రామంలో మంగ‌ళ‌వారం తెల్లవారుజామున‌ ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం చాపిరేవుకు చెందిన వెంక‌ట‌మ్మ (70) ఇంటికి అదే జిల్లాకు చెందిన బేతంచ‌ర్ల మండ‌లం పెండేక‌ల్లు గ్రామానికి చెందిన బంధువులు సుబ్బమ్మ, రాముడు సోమ‌వారం రాత్రి వ‌చ్చారు. వారికి రాత్రి భోజ‌నాలు వండిప‌ట్టి పొర‌పాటున గ్యాస్ ఆఫ్ చేయ‌లేదు. ఆ త‌రువాత బంధువుల‌తో మాట‌మంతి చేసి ప‌డుకున్నారు.

గ్యాస్ లీకై ప్రమాదం

గ్యాస్ ఆఫ్ చేయ‌క‌పోవ‌డంతో ప్రమాద‌వ‌శాత్తు గ్యాస్ కొద్దికొద్దిగా లీకైంది. రాత్రి నుంచి తెల్లవారుజాము వ‌ర‌కు అలానే గ్యాస్ లీక‌వుతూనే ఉంది. మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 4 గంట‌ల‌కు నిద్రలేచిన వెంక‌ట‌మ్మ వంట‌గ‌దిలో లైట్ వేసింది. అంతే అప్పటికే గ్యాస్ లీక‌వ్వడంతో ఒక్కసారిగా సిలిండ‌ర్ పేలి మంట‌లు వ్యాపించాయి.

గ్యాస్ సిలిండ‌ర్ పేలుడు ధాటికి ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఇంటి మిద్దె పైక‌ప్పు కింద‌కు ప‌డింది. ఈ ప్రమాదంలో వెంక‌ట‌మ్మ (70), దినేష్ (10) అక్కడిక‌క్కడే మృతి చెందారు. బంధువులు సుబ్బమ్మ, రాముడుతో పాటు రామ‌ల‌క్ష్మి, సుబ్బరాయుడు, కార్తీక్‌, వెంక‌టేశ్వరి, లింగ‌మ‌య్య, సుధీర్‌, సుశాంత్‌కు గాయాలు అయ్యాయి.

ఇద్దరు మృతి

శిథిలాల కింద చిక్కుకున్న మృత దేహాల‌ను, క్షత‌గాత్రుల‌ను వెలికితీసి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. బాలుడు దినేష్, వృద్ధురాలి వెంక‌ట‌మ్మ మృదేహాల‌ను మూడు గంట‌ల పాటు శ్రమించి బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. స్థానికుల‌ను వివ‌రాల అడిగి తెలుసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి చుట్టుప‌క్కల నివాసాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner