Transgender Marriage : ఆంధ్ర ట్రాన్స్ జెండర్, తెలంగాణ అబ్బాయి ప్రేమ పెళ్లి- పోలీస్ స్టేషన్ కు పంచాయితీ!
Transgender Marriage : తెలంగాణకు చెందిన ఓ యువకుడు, నందిగామకు చెందిన ట్రాన్స్ జెండర్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. వారం క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లిని ఒప్పుకోని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Transgender Marriage :ప్రేమకు లింగ భేదం అడ్డురాదనే ఘటన తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు ఏపీలోని నందిగామకు చెందిన ట్రాన్ జెండర్ ఏడాదిగా ప్రేమించుకున్నారు. వారం క్రితం వీరద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరిని విడగొట్టేందుకు తమ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని పోలీసులను ఆశ్రయించారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన గణేష్, ఆంధ్రప్రదేశ్ కు నందిగామకు చెందిన ట్రాన్స్ జెండర్ దీపు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉంటున్న వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తాను ట్రాన్స్ జెండర్ అని తెలిసే గణేష్ ప్రేమించాడని దీపు అంటోంది. వారం రోజుల క్రితం వీరు వివాహం చేసుకోగా, తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కుట్ర చేస్తు్న్నారని దీపు, గణేష్ నందిగామ పోలీసులను ఆశ్రయించారు.
"గణేష్ ను హైదరాబాద్ లో కలిశాను. వన్ ఇయర్ నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. వారం క్రితం పెళ్లి చేసుకున్నాం. నేను ట్రాన్స్ జెండర్ అని తెలిసినా గణేష్ లవ్ చేశాడు. మా పెళ్లిని గణేష్ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంలేదు. గణేష్ నాతోనే ఉంటున్నాడు. గణేష్ ను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే పోలీసులను ఆశ్రయించాము."- దీపు
'దీపు ట్రాన్స్ జెండర్ అని తెలిసి పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోలేదు. వాళ్లకు తెలియకుండా మేము పెళ్లి చేసుకున్నాం. దీపుతోనే కలిసి జీవిస్తాను. నన్ను తీసుకెళ్లేందుకు మా కుటుంబ సభ్యులు వచ్చారు. అందుకే పోలీసులను ఆశ్రయించాం.' -గణేష్
గణేష్ తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వీరిద్దరినీ పిలిపించి మాట్లాడారు. తాము ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. తమ ప్రేమ పెళ్లి సమాజానికి కనువిప్పు అని గణేష్, దీపు అంటున్నారు. ట్రాన్స్ జెండర్ తో జీవితాన్ని పంచుకోవడం తప్పేం కాదని గణేష్ అంటున్నారు. వాళ్లు ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం వదిలిపెట్టరని అన్నారు. కేరళలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకుని ఘటన సంచలనం అయింది. ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్ల వివాహాలు తరచూ వార్తలో నిలుస్తున్నాయి. అయితే ట్రాన్స్ జెండర్ల వివాహలను చట్టబద్ధత చేసేందుకు ఇటీవల సుప్రీంకోర్టు నిరాకరించింది.