Nagarjuna Sagar Dam Issue : ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి 'సాగర్ వివాదం'- అసలేంటీ ఇష్యూ, కారణమెవ్వరు?
Nagarjuna Sagar Dam Issue : ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి నాగార్జున సాగర్ వివాదం నెలకొంది. తెలంగాణ అధికారులు కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు చేసేందుకు ప్రయత్నించగా, ఏపీ అధికారుల వారిని అడ్డుకున్నారు. దీంతో మరోసారి సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. గతేడాది సరిగ్గా నవంబర్ లోనే సాగర్ పై ఘర్షణ తలెత్తింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య మరోసారి 'నాగార్జున సాగర్ వివాదం' రాజుకుంది. గత ఏడాది సరిగ్గా నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మళ్లీ నవంబర్ లోనే సాగర్ వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి కుడి కాల్వ వాటర్ రీడింగ్ నమోదు వివాదానికి దారితీసింది. వాటర్ రీడింగ్ తీసేందుకు తెలంగాణ అధికారులు ప్రయత్నించారు. వీరిని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యాజమాన్యానికి తెలంగాణ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై కేఆర్ఎంబీ ఇరు రాష్ట్రాల అధికారులకు సర్ది చెప్పింది.
అయితే ప్రతిరోజు తెలంగాణ డ్యామ్ సిబ్బంది సాగర్ రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ ను నోట్ చేసుకుంటారని తెలుస్తోంది. శనివారం కూడా తెలంగాణ అధికారులు యథావిధిగా రైట్ కెనాల్ వాటర్ రీడింగ్ కోసం వెళ్లగా...తెలంగాణ సిబ్బందిని ఏపీ డ్యామ్ సిబ్బంది అడ్డుకోవడంతో జల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
గతేదాడి నవంబర్ లోనే
గతేడాది నవంబర్ 28న నాగార్జున సాగర్ కుడికాల్వ నుంచి నీటిని విడుదల చేయడానికి ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రయత్నించారు. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. సాగర్ పదమూడు గేట్ల నుంచి ఏపీ ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించారు. నీటి విడుదలను అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నించగా... ఏపీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వీరి మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. డ్యామ్ కు ఇరువైపులా ముళ్ల కంచెలు వేసి...కొన్ని రోజులు ఎవరినీ అనుమతించలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర జలశక్తి సంఘం, కేఆర్ఎంబీ అధికారులు రంగంలో దిగి పరిస్థితిని చక్కదిద్దారు. సరిగ్గా ఎన్నికల పోలింగ్ రోజున ఈ వివాదం నెలకొనడంపై అప్పట్లో అనుమానాలు తలెత్తాయి. అప్పట్లో ఏపీలో వైసీపీ, తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయి. ఇరు ప్రభుత్వాలు స్నేహపూర్వకంగా ఉన్నా జల వివాదాలు పరిష్కారం కాలేదు.
అసలేంటీ వివాదం?
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో... కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటు అయ్యాయి. అప్పట్లో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్ కు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణకు కేంద్ర జల సంఘం కేటాయించింది. అయితే ఈ నిర్ణయం సరిగ్గా అమలు కాలేదు. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ విద్యుత్తు కేంద్రాన్ని తెలంగాణ నిర్వహిస్తుంది. అటుగా ఏపీ అధికారులను అనుమతించడంలేదు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 26 గేట్లకు 1-13 గేట్లు తెలంగాణ, 14-26 గేట్లను ఏపీ నిర్వహిస్తుంది. కుడి కాల్వ నుంచి ఏపీకి నీళ్లను తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. అయితే నీళ్ల విడుదల తరచూ రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారింది. నీటి విడుదలకు కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా తెలంగాణ అధికారులు నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఏపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
దశాబ్దాల తరబడి సాగర్ డ్యామ్ వివాదం నడుస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తెలంగాణకు కేటాయించిన వాటా ప్రకాటం నీటిని వినియోగించుకోవడంలో తమను అన్యాయం జరుగుతోందని తెలంగాణ వాదన. ఏపీకి కేటాయించిన వాటాతో పాటు అదనంగా నీటిని తరలించుకుపోతుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఉమ్మడి నల్గొండ సహా హైదరాబాద్ తాగునీటికి సాగర్ డ్యామ్ కీలకం. అత్యవసర సమయంలో సాగర్ టెయిల్ పాండ్ బ్యాక్ వాటర్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తెలంగాణ విద్యుత్ ఉత్తత్పి చేస్తుంది. అయితే పలుమార్పు టెయిల్ పాండ్ కుడివైపు నీటిని ఏపీ ఖాళీ చేసిందనే విమర్శలు ఉన్నాయి.
బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు-వివాదం
కృష్ణా నదీ జల వివాదాలపై 1969లో కేంద్రం బచావత్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976 మే నెలలో తుది తీర్పు ఇచ్చింది. కృష్ణా నది బేసిన్ లో 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. ఉమ్మడి ఏపీలో రాజారావు కమిటీ సిఫార్సుల మేరకు ఏపీ, తెలంగాణకు వేర్వేరుగా నీటి కేటాయింపుల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం మేరకు తెలంగాణకు 293.96 టీఎంసీలు, ఏపీకి 512.04 టీఎంసీలు కేటాయించారు. ఏపీ, తెలంగాణ విభజన అనంతరం కూడా నీటి కేటాయింపులు ఈ ఒప్పందం ప్రకారమే జరుగుతున్నాయి. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. నీటి కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని వాదన వినిపిస్తుంది. నీటి కేటాయింపుల క్యాచ్ మెంట్ ఏరియా, కరవు ప్రాంతాలు, బేసిన్ జనాభా, సాగు విస్తీర్ణం ప్రకారం జరగాలని తెలంగాణ కోరుతుంది. బచావత్ ట్రిబ్యునల్ నికర జలాల ఆధారంగా అప్పట్లో కేటాయింపు చేసిందని ఆరోపిస్తుంది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులపై సమీక్షించాలని కోరుతుంది.
సంబంధిత కథనం