Kurnool : పోలీసుల చుట్టూ తిరిగి అలసిపోయాం.. కన్నీరు పెట్టిస్తున్న దంపతుల వీడియో
Kurnool : ఆ కుటుంబం ఎంతో కష్టపడి షాపులు నిర్మించుకుంది. వాటిని అద్దెకు ఇచ్చింది. కానీ.. అద్దెకు తీసుకున్న వారు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫలితం లేదు. ఇక తమకు చావే దిక్కని ఆ కుటుంబం వీడియో విడుదల చేసింది. నంద్యాలలో ఇది చర్చనీయంశంగా మారింది.
నంద్యాలలో ఓ ఆర్య వైశ్య కుటుంబం అదృశ్యం వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. అదృశ్యానికి ముందు ఆ కుటుంబం విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. కుటుంబంతో సహా ఆత్మహత్య తప్పదని ఆ కుటుంబ సభ్యులు సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో నాగరాజు అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. నాగరాజు కుటుంబానికి షాపులు ఉన్నాయి. వాటిని అద్దెకు ఇచ్చారు. దుకాణాలను అద్దెకు ఇస్తే ఆరు నెలలుగా బాడుగ చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని నాగరాజు కుటుంబ సభ్యులు వాపోయారు. తాజాగా.. నాగరాజు కుటుంబ సభ్యులను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజుల నుంచి తన కుటుంబసభ్యుల ఫోటోలు, వీడియోలు తీసి.. తప్పుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వేధింపులకు పాల్పడినట్టు నాగరాజు వాపోయారు. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరిగి అలసి పోయామని.. చెప్పారు. దుకాణాల్లో అద్దెకు ఉన్న అరుణ్ తప్పుడు పత్రాలతో కోర్టులో కేసు వేశారని నాగరాజు ఆరోపించారు. దుకాణాలు 2022లో నిర్మాణం జరిపితే.. 2018లో బాడుగకు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని నాగరాజు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కోర్టులో కేసు ఉండటంతో పోలీసులు ఏ చర్యలు తీసుకోలేదని.. నాగరాజు కుటుంబం చెబుతోంది. తన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదని నాగరాజు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. నాగరాజు కుటుంబం వీడియో బయటకు వచ్చింది. దీంతో ఆయన ఇంటి వద్దకు పోలీసులు వెళ్లారు. అప్పటికే ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో నాగరాజు కుటుంబం ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
'దుకాణాలు బాడుగకు ఇవ్వడం మేము చేసిన తప్ప. ఖాళీ చెయ్యమని అడిగినందుకు చంపుతామని బెదిరిస్తున్నారు. న్యాయం జరగకపోవడంతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాము. మా సమస్య పరిష్కారం కాకపోవడంతో సెల్ఫీ వీడియోతో మీ ముందుకు వచ్చాము. మాకు మా కుటుంబ సభ్యులకు ఏమి జరిగినా మా దుకాణంలో బాడుగకు ఉన్నవారే బాధ్యులు. ముఖ్య గమనిక ప్రజలు దుకాణాలు బాడుగకు ఇచ్చే సమయంలో అన్ని సరిచూసుకుని ఇవ్వాలని కోరుతున్నాను' అని నాగరాజు వీడియోలో వ్యాఖ్యానించారు.