వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యకేసు నమోదు...
కాకినాడ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్యకేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారులో డెడ్ బాడీ కేసులో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి రావడం, కేసు నమోదు చేసే వరకు పోస్టుమార్టంకు అంగీకరించమని తేల్చి చెప్పడంతో పోలీసులు ఎమ్మెల్సీపై హత్య కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కాకినాడ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ హత్య కేసులో అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. 48గంటల ఉద్రిక్తత తర్వాత కేసు నమోదు చేసే వరకు పోస్టుమార్టంకు మ ృతుడి కుటుంబం అంగీకరించపోవడంతో ఎమ్మెల్సీపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. గురువారం ఎమ్మెల్సీ వెంట వెళ్లిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అదే కారులో శవమై తిరిగి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని మృతుడి బంధువులకు సమాచారం ఇవ్వడం, శవాన్ని తీసుకోడానికి వారు నిరాకరించడంతో వివాదం తలెత్తింది. హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలతో రెండు రోజులుగా కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అధికార పార్టీ ఎమ్మెల్సీని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. పోస్టుమార్టం కోసం మృతుడి భార్య, తల్లిదండ్రులపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆడియో రికార్డులు బయటకు రావడంతో, డ్రైవర్ భార్య పోస్టుమార్టంకు అంగీకరించాలంటూ, పోలీసులు కొడుతున్నారని విలపించడంతో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కాకినాడ జిజిహెచ్‌ను ముట్టడించాయి. శనివారం రోజంతా ఉద్రిక్తత కొనసాగింది. అధికార పార్టీ ఎమ్మెల్సీ మీద చర్య తీసుకునే విషయంలో పోలీసుల వైఖరిపై అన్ని పార్టీల నుంచి విమర్శలు రావడంతో హత్యకేసు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు.
కారు డ్రైవర్ మృతి కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా భావిస్తున్నట్లు ఎస్పీ రవీంద్రనాధ్ బాబు చెప్పారు. అనుమానస్పద మృతి కేసు నుంచి హత్యకేసుకు మారుస్తున్నట్లు ప్రకటించారు. శవపరీక్ష తర్వాత మృతికి కారణాలు తెలుస్తాయన్నారు. కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలని డిజిపి ఆదేశించినట్లు ఎస్పీ చెప్పారు. అనంతబాబు కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్సీతో పాటు ఈ కేసులో పాత్ర ఉన్న వారందరిని విచారిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు డ్రైవర్ హత్యకేసు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు ఎస్పీ చెప్పారు అనంతబాబుతో పాటు మరికొందరిపై హత్య, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కేసులు నమోదు చేశామన్నారు. శుక్రవారం ఉదయం డ్రైవర్ శవాన్ని వదిలేసి వెళ్లిన తర్వాత అదే రోజు సాయంత్రం రెండు వివాహ వేడుకల్లో ఎమ్మెల్సీ పాల్గొనడం విశేషం. డిప్యూటీ తాసీల్దార్ వివాహంతో పాటు, ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది పెళ్లి వేడుకకు హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
టాపిక్