Nara Lokesh : బాంబులకే భయపడని వాళ్లం, కేసులకు భయపడతామా?- సీఎం జగన్ పై లోకేశ్ ఫైర్
Nara Lokesh : చంద్రబాబు, పవన్ కలవకూడదని సీఎం జగన్ విశ్వప్రయత్నాలు చేశారని లోకేశ్ ఆరోపించారు. వంద సంక్షేమ పథకాలు తొలగించిన ఏకైక సీఎం.. జగన్ అని విమర్శించారు.
Nara Lokesh : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. యువగళం పాదయాత్రంలో భాగంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆయన మాట్లాడారు. నా పాదయాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నేతల విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అక్రమ కేసుల పెట్టి వేధించారని, ఇలాంటి కేసులకు భయపడే కుటుంబం మాది కాదన్నారు. సీఎం జగన్ మాట విన్న అధికారులు దిల్లీకి క్యూకడుతున్నారన్నారు. చంద్రబాబు, పవన్ కలవకూడదని సీఎం జగన్ చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతుందని, వారికి తరచూ మెమోలు ఇస్తుందని మండిపడ్డారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మూడు నెలలు ఓపిక పట్టాలని లోకేశ్ కోరారు.
ఎస్సీ సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తాం
వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తు్న్న దళితులను ఊచకోత కోస్తున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటూ వారిపట్ల సీఎం జగన్ కపట ప్రేమను నటిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎస్సీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసిందన్నారు. రూ.28,147 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తామన్నారు. దళితులను వేధించిన వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరించారు.
ఆయనకు ఆత్మలతో మాట్లాడే శక్తి
జగన్‌కు ఆత్మలతో మాట్లాడే శక్తి ఉందని నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. బాంబులకే భయపడని వాళ్లం, కోర్టులు, కేసులకు భయపడతామా? అన్నారు. ఏపీలో నిశబ్ద యుద్ధం జరగబోతుందన్న లోకేశ్, వంద సంక్షేమ పథకాలను తొలగించిన ఏకైక వ్యక్తి జగన్ అని సెటైర్లు వేశారు. ఛార్జీలను అడ్డగోలుగా పెంచుతూ బాదుడే బాదుడుతో సీఎం జగన్ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. మాట ఇచ్చి మడమ తప్పిన వ్యక్తి జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మడమ తిప్పారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 27 దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మూడు నెలల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాడుతుందని లోకేశ్ అన్నారు. విషపూరితమైన మద్యాన్ని సీఎం జగన్ అమ్ముతూ డబ్బులు దోచుకుంటున్నాడని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.