Vizag Flight : వైజాగ్ వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్-mumbai to vizag flight makes emergency landing in hyderabad after technical snag ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Flight : వైజాగ్ వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Vizag Flight : వైజాగ్ వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య.. హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Basani Shiva Kumar HT Telugu
Jan 04, 2025 10:35 AM IST

Vizag Flight : ఆ విమానం వైజాగ్ వెళ్లడానికి ముంబయి నుంచి బయలుదేరింది. చాలా దూరం వచ్చాక ఏదో సమస్య ఉన్నట్టు పైలట్ గుర్తించారు. వెంటనే హైదరాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో ఆ ఫ్లైట్‌లో ఉన్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండిగో విమానం
ఇండిగో విమానం

ముంబయి నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానంలో 144 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్.. వెంటనే విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించారు. ఎటువంటి ప్రమాదం లేకుండా విజయవంతంగా ల్యాండ్ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

yearly horoscope entry point

ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాల గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. దీనికి సాంకేతిక సమస్యలు సహా వివిధ కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణ కొరియాలో విషాదకరమైన ఘటన జరిగింది. జెజు ఎయిర్ విమానం మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే సమయంలో కూలిపోయింది. ఈ ఘటనలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విమాన ప్రయాణికులను మరింతగా భయపెట్టింది.

ఎమర్జెన్సీ సమయంలో జాగ్రత్తలు..

1.విమానం బయలుదేరే ముందు ఎయిర్ హోస్టెస్‌లు ఎమర్జెన్సీ సమయంలో ఏమి చేయాలో వివరించే డెమో ఇస్తారు. ఆ సూచనలను జాగ్రత్తగా విని, మనసులో ఉంచుకోవాలి.

2.ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఎక్కడ ఉన్నాయో గమనించాలి. ఆక్సిజన్ మాస్క్‌లు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఎమర్జెన్సీ లైఫ్ జాకెట్‌లు ఎక్కడ ఉన్నాయో గమనించి గుర్తుంచుకోవాలి.

3.ఎమర్జెన్సీ సమయంలో గందరగోళం చెందకుండా, శాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎయిర్ హోస్టెస్‌ల సూచనలను పాటించాలి. ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలకు సాయం చేయాలి.

4.ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ల వద్దకు వేగంగా కదలాలి. ఎవరినీ అడ్డుకోకుండా జాగ్రత్తపడాలి. ఎమర్జెన్సీ స్లైడ్‌పై జారి దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

5.ఎమర్జెన్సీ సమయంలో వ్యక్తిగత వస్తువుల గురించి ఆందోళన చెందకుండా.. ఫస్ట్ ప్రాణాలను రక్షించడంపై దృష్టి పెట్టాలి.

విమానాలు ఆలస్యం..

మరోవైపు శుక్రవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో 100 కి పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు కారణంగా.. విమానాలు ఆలస్యం అయ్యాయని.. ఇప్పటివరకు ఎటువంటి మళ్లింపులు లేవని అధికారులు చెబుతున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ప్రతీరోజు దాదాపు 1300 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి.

Whats_app_banner