Manda Krishna : కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదు, హోంమంత్రిని అంటే సీఎంను అన్నట్లే- పవన్ పై మంద కృష్ణ ఫైర్
Manda Krishna On Pawan Kalyan : కేబినెట్ అంటే ఓ కుటుంబం, పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని, సీఎంను అన్నట్టే అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హోంమంత్రి అనితను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిక స్పందించారు. పవన్ కల్యాణ్ నోటి నుంచి అలాంటి వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమన్నారు. ఆయన బహిరంగంగా అలా మాట్లాడటం సరికాదన్నారు. మంత్రివర్గంలోనో, అంతర్గతంగా మాట్లాడుకోవాలన్నారు. ఓ దళిత బిడ్డను అవమానించడం అంటే అది సీఎం పరిపాలన పైనే ఆ వ్యాఖ్యలు చేసినట్టు అవుతుందని మంద కృష్ణ మాదిగ అన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఈ ప్రభుత్వానికి నష్టం, మాదిగ కులానికి అవమానం అన్నారు. ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్ పై అసంతృప్తి వ్యక్తం చేశామన్నారు.
"సామాజిక న్యాయం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ మాదిగలకు ఎక్కడ న్యాయం చేశారు. జనసేన అంటే ఒకటి రెండు కులాల పార్టీ నా అందరి పార్టీనా. మూడు మంత్రి పదవుల తీసుకుని ఒక్కటీ కూడా బీసీకి, ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు. కమ్మ, కాపులు మాత్రమే జనసేనకు ఓట్లు వేయలేదు. హోంమంత్రిని అంటే ప్రభుత్వాన్ని, సీఎంను అన్నట్టే. మాలలకు ఇచ్చిన ప్రాధాన్యత మాకు ఇవ్వని పవన్ సామాజిక న్యాయం గురించి ఎలా మాట్లాడతారు. మాట్లాడే సమయం వచ్చినపుడు అన్ని విషయాలు మాట్లాడతాం" - మంగకృష్ణ మాదిగ
ఎమ్మార్పీఎస్ నాల్గో స్తంభం
టీడీపీ, బీజేపీ, జనసేన మూడు స్తంభాలైతే నాల్గో స్తంభం ఎమ్మార్పీఎస్ పనిచేసి కూటమిని గెలుపు బాటలో నిలబెట్టిందని మంగ కృష్ణ మాదిగ అన్నారు.
తాము ప్రభుత్వంలో భాగస్వాములం కాకపోయినా ఫలితం మా బిడ్డలకు దక్కాలన్నారు. మాదిగలు సంతృప్తి పడేలా భాగస్వామ్యం ఉండేలా చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కేబినెట్ అంటే ఓ కుటుంబమని, పవన్ మాటలు ప్రభుత్వానికి నష్టం అన్నారు. రేపు పవన్ మాటలు ఆయన శాఖకు కూడా వర్తిస్తాయని తెలిపారు.
సీఎం చంద్రబాబును కలిసిన మందకృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో చర్చించారు. మందకృష్ణ తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే?
ఇష్టమొచ్చినట్లు వైసీపీ నేతలు వ్యవహరిస్తుంటే హోంమంత్రి ఏం చేస్తున్నారు? చర్యలు తీసుకోరా? ఆడబిడ్డలను బెదిరిస్తూ, అవమానిస్తుంటే అరెస్టు చేయరా? మీరు బాధ్యతగా వ్యవహరించండి, బలంగా పనిచేసి చట్టపరంగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.
'నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని. హోమ్ శాఖ మంత్రిని కాదు. పరిస్థితులు చెయ్యి దాటితే నేను హోమ్ శాఖ తీసుకుంటాను. నేను తీసుకుంటే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తరహాలో వ్యవరిస్తాను. డీజీపీ గత ప్రభుత్వంలా వ్యవహరించకూడదు. బాధ్యత తీసుకోండి. పాత పద్ధతులు పాటిస్తాం అంటే చూస్తూ ఊరుకోను. ప్రజలు ఇచ్చిన పదవి ఇది, వారికి రక్షణ కల్పించాలి.' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం