MP Vijaya Sai Reddy : సాయిరెడ్డి వ్యూహం అదేనా….?-mp vijaya sai reddy strategy for relation with bjp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Mp Vijaya Sai Reddy Strategy For Relation With Bjp

MP Vijaya Sai Reddy : సాయిరెడ్డి వ్యూహం అదేనా….?

HT Telugu Desk HT Telugu
Nov 14, 2022 08:13 AM IST

MP Vijaya Sai Reddy వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి రాజకీయాల్లో ప్రవేశించకు ముందు వాటితో పెద్దగా సంబంధం లేదు. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌గా తన పని తాను చేసుకునే వారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌ రెడ్డి పని చేసిన సమయంలో ఆయన జగన్మోహన్‌ రెడ్డి కంపనీల వ్యవహారాలను చూసేవారు. ప్రస్తుతం రెండో విడత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సాయిరెడ్డి పార్టీ సోషల్‌ మీడియాలో ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించడం వెనుక రాజకీయ వ్యూహాలున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది.

వైఎస్సార్సీపీ  ఎంపీ సాయిరెడ్డి
వైఎస్సార్సీపీ ఎంపీ సాయిరెడ్డి

MP Vijaya Sai Reddy ఎంపీ విజయసాయిరెడ్డి వార్తల్లో కనిపించినా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చర్చల్లో ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటుగా స్పందిస్తుంటారు. వ్యక్తిగత ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థుల్ని దుయ్యబడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సోషల్ మీడియాలో వినియోగించే భాష అభ్యంతరకరంగా ఉన్నట్లు అనిపించినా ఆయన పెద్దగా ఖాతరు చేయరు. ఇది పార్టీకి మంచిదా కాదా అనే విషయాన్ని పక్కన పెడితే ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయంగా మాత్రం కొన్ని విషయాల్లో క్లారిటీ ఇస్తుంటాయి.

ట్రెండింగ్ వార్తలు

బీజేపీతో తెగకుండా, చెడకుండా….?

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి ఏ రాజకీయ పార్టీతోను పొత్తులు లేవు. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల జాబితాలో కొన్ని పార్టీలు మాత్రమే ఉన్నాయి. టీడీపీ, జనసేనల్ని మాత్రమే వైసీపీ ప్రత్యర్ధి పార్టీలుగా పరిగణిస్తోంది. బీజేపీకి క్షేత్ర స్థాయిలో తగినంత బలం లేకపోవడం ఓ కారణం అయితే, బీజేపీపై దూకుడు ప్రదర్శించే పరిస్థితులు రాజకీయంగా లేకపోవడం మరో కారణం. ఇటీవల ప్రధాని విశాఖ పర్యటనలో కేంద్రంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమైందని, రాష్ట్ర ప్రయోజనాలే తమకు అన్నింటి కన్నా ముఖ్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

వైసీపీలో రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి అందరికీ అనుమతి లేదు. ముఖ్యమంత్రి జగన్ బయట పెద్దగా మాట్లాడరు కాబట్టి పార్టీ వైఖరి సాయిరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తులకు తప్ప బయటకు తెలిసే అవకాశం ఉండదు. ఇటీవలి కాలంలో ఎంపీ సాయిరెడ్డి ప్రత్యర్థి పార్టీలపై దూకుడుగా కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన విషయంలో ఆయన తీరు సాధారణమే అనుకున్నా, కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల రాహుల్ పాదయాత్ర విషయంలోను, ఏఐసిసి అధ్యక్ష ఎన్నికల విషయంలోను విజయసాయిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో సాయిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.

టీడీపీ-జనసేనలను విమర్శించడం జనానికి అర్థమైనా, కాంగ్రెస్ పార్టీ విషయాన్ని సీరియస్‌గా ఎందుకు తీసుకుంటున్నారనే చర్చ జరిగింది. సాయిరెడ్డి వ్యాఖ్యలు, విమర్శల వెనుక ముందస్తు వ్యూహం ఉందనే అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. వైఎస్‌ మరణం తర్వాత జగన్‌తో పాటు జైలుకు వెళ్లడానికి కాంగ్రెస్ పార్టీ కారణమనే విషయంలో సాయిరెడ్డికి పూర్తి స్పష్టత ఉంది. కాంగ్రెస్ పార్టీని వీలైన ప్రతిసారి వ్యతిరేకించే విషయంలో వెనకాడటం లేదు. గతంలో ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ పార్టీతో పాటు, మరో పక్షం కూడా వేర్వేరుగా ఆందోళన చేపడితే, రాజకీయ పార్టీతో సంబంధం లేని ఆందోళనకు మాత్రమే సాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం పోరాటానికి మద్దతు ప్రకటించాల్సిందిగా అక్కడున్న వారు సూచించినా, తనకు జ్ఞాపక శక్తి పని చేసినంత కాలం కాంగ్రెస్‌తో కలిసి పోరాడేది లేదని సాయిరెడ్డి తేల్చేశారు.

బీజేపీకి సందేశం ఇవ్వడానికేనా…?

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీని విమర్శించే విషయంలో సాయిరెడ్డి ముందస్తు వ్యూహంతో ఉన్నారనే అభిప్రాయం కూడా ఉంది. జగన్మోహన్‌ రెడ్డి, సాయిరెడ్డి తరహాలోనే యూపీఏ హయంలో అమిత్‌షా, మోదీలు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. అమిత్‌షాపై ఏకంగా రాష్ట్ర బహిష్కరణ విధించారు. దీంతో ఆయన యూపీ వెళ్ళి పనిచేసుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందనే అభిప్రాయం బీజేపీ, వైసీపీ నేతల్లో ఉండొచ్చని, అదే రెండు పార్టీలను దగ్గర చేసి ఉంటుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఏపీలో బీజేపీతో రాజకీయ పొత్తు పెట్టుకునే అవకాశం లేకున్నా బీజేపీ కోసం కొన్ని స్థానాలను త్యాగం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి వైసీపీ దూరం అనే సందేశాన్ని ఇవ్వడానికే ఎంపీ సాయిరెడ్డి సోషల్ మీడియాను వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల పొత్తుల విషయంలో గతంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రకటించారు. 2019లో ఏ పార్టీతో అవసరం లేకుండానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ లభించినా, ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతు అవసరమైతే వైసీపీ ప్రాధాన్యత బీజేపీకి లభిస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికే ఎంపీ సాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారని అంచనా వేస్తున్నారు.

WhatsApp channel

టాపిక్