Kesineni Daughter: టీడీపీకి బైబై.. తండ్రి బాటలో కేశినేని కుమార్తె శ్వేత
Kesineni Daughter: విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని బాటలో ఆయన కుమార్తె శ్వేత కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.
Kesineni Daughter: టీడీపీకి రాజీనామాచేస్తున్నట్టు ప్రకటించిన ఎంపీ కేశినేని నాని బాటలో ఆయన కుమార్తె శ్వేత కూడా టీడీపీ వీడనున్నారు. ఈ మేరకు ఎంపీ నాని తన ఫేస్‌బుక్ ఖాతాలో శ్వేత పార్టీని వీడుతారని ప్రకటించారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేటర్‌గా ఉన్న శ్వేత పదవికి రాజీనామా చేస్తారని వెల్లడించారు. కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు.
ఎంపీ నాని తన కుమార్తె కేశినేని శ్వేత కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 10.30 గంటలకు కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలిపారు.
గత వారం తిరువూరులో కేశినేని నాని, చిన్ని వర్గాల మధ్య ఘర్షణ తర్వాత కేశినేని నానిని పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు నాయుడు సందేశం పంపారు. తిరువూరు సభ నిర్వహణ బాధ్యత చిన్ని చూసుకుంటాడని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించలేమని నానికి తేల్చేశారు. దీంతో పార్టీని వీడుతున్నట్లు కేశినేని ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్తునుప్రజలే నిర్ణయిస్తారని ప్రకటించారు. తాజాగా కుమార్తె కూడా టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.
2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఎంపీ నాని కుమార్తె శ్వేత బరిలో దిగారు. నాటి ఎన్నికల్లో వైసీపీకి మెజార్టీ దక్కడంతో కార్పొరేషన్ ఆ పార్టీ వశమైంది. నాటి ఎన్నికల్లో 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైనా మూడున్నరేళ్లలో ఆమె ఒక్కసారి కూడా కౌన్సిల్‌కు హాజరైన దాఖలాలు లేవు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేయర్ పదవి దక్కకపోవడంతో కార్పొరేషన్‌తో అంటిముట్టునట్టు వ్యవహరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితం చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన సమయంలో పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికిన సందర్భంలో మాత్రమే ఆమె బయట కనిపించారు. కార్పొరేటర్‌గా ప్రజలు ఎన్నుకున్నా డివిజన్ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించిన సందర్భాలు లేవు. తాజాగా తండ్రితో పాటు పార్టీకి, పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.