Tirupati Crime : బిడ్డ ప్రాణం కంటే పరువే ముఖ్యమైంది.. దళిత యువకుడిని ప్రేమించిన కుమార్తెను చంపేసిన తల్లి!-mother kills daughter for loving a young man from a different caste in tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Crime : బిడ్డ ప్రాణం కంటే పరువే ముఖ్యమైంది.. దళిత యువకుడిని ప్రేమించిన కుమార్తెను చంపేసిన తల్లి!

Tirupati Crime : బిడ్డ ప్రాణం కంటే పరువే ముఖ్యమైంది.. దళిత యువకుడిని ప్రేమించిన కుమార్తెను చంపేసిన తల్లి!

Tirupati Crime : పరువు కోసం కన్న బిడ్డలను కడతేర్చుతున్నారు. చెప్పిన మాట వినడం లేదని చేతులు కట్టేసి చంపుతున్నారు. ఆఖరికి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తిరుపతి జిల్లాలో జరిగింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని ఓ తల్లి కుమార్తెను చంపేసింది. ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

యువకుడితో బాలిక (ఫైల్ ఫొటో)

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16).. సమీపంలోని హరిజనవాడకు చెందిన యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో కుమార్తె గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న తల్లి అబార్షన్‌ చేయించింది. ఆ యువకుడికి దూరంగా ఉండాలని కుమార్తెను హెచ్చరించింది. అయినా వారు మళ్లీ కలిసి తిరగారు. దీంతో బాలికను వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువకుడిపై పోక్సో కేసు..

యువకుడిపై పోలీసులు పోక్సో కేసు పెట్టి చిత్తూరు జైలుకు పంపారు. ఆ సమయంలోనూ బాలిక రెండుసార్లు జైలుకు వెళ్లి యువకుడిని కలిసింది. ఈ నేపథ్యంలోనే యువకుడు జైలు నుంచి విడుదలయ్యాడు. మళ్లీ వారి మధ్య సంబంధం కొనసాగింది. జైలు నుంచి బయటకు వచ్చిన యువకుడితో కుమార్తె కలిసి తిరుగుతోందని తల్లి గుర్తించింది. బాలికకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించింది.

యువకుడే కావాలని..

బాలిక బంధువులు అతనితో వెళ్లవద్దని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆ బాలిక యువకుడే కావాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత తన నుంచి వేరుగా ఉంటున్న భర్తకు విషయం చెప్పింది. కుమార్తెను ఒప్పించాలని ప్రయత్నించింది. ఈ క్రమంలోనే కుమార్తె ఫోన్‌ తీసుకుని బయటకు వెళుతుండగా.. తల్లి గమనించింది. బాలికను కొట్టింది. బాలిక ప్రతిఘటించింది. దీంతో వెనుక నుంచి రెండు చేతులతో నోరు, ముక్కు అదిమి పట్టడంతో కొద్దిసేపటికి బాలిక కింద పడిపోయి మృతిచెందింది.

భర్తకు ఫోన్ చేసి..

బాలిక మృతి చెందిన విషయాన్ని గుర్తించిన తల్లి ఇంటికి తాళాలు వేసి పనికి తిరుమలకు వెళ్లిపోయింది. తెల్లారి భర్తకు ఫోన్‌ చేసి పాఠశాలకు పంపేందుకు కుమార్తెను నిద్ర లేపమని ఇంటికి పంపింది. ఆయన వెళ్లి చూడగా బాలిక విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆయన బంధువులకు సమాచారం ఇచ్చారు. తిరుమల నుంచి వచ్చిన తల్లి.. బంధువులతో కలిసి ఆటోలో మృతదేహాన్ని వంకలోకి తీసుకెళ్లి దహనం చేసింది.

జిల్లా ఎస్పీ సీరియస్..

ఈ వ్యవహారం అంతా నాలుగు రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు దీనిపై సమగ్ర విచారణ చేయించారు. పోలీసుల విచారణలో పరువు హత్యకు సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ తల్లిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం