పంచరామ క్షేత్రంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం.. పంచారామాలు ఇవే-moola virat darshans resume at pancharama kshetra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  పంచరామ క్షేత్రంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం.. పంచారామాలు ఇవే

పంచరామ క్షేత్రంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం.. పంచారామాలు ఇవే

HT Telugu Desk HT Telugu
Jun 25, 2024 06:40 AM IST

పంచరామ క్షేత్రంగా ప్ర‌సిద్ధి చెందిన సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. దీన్ని భక్తులంతా గమనించి ద‌ర్శ‌నాలకు రావ‌చ్చ‌ని ఆలయ పాలక కమిటీ పేర్కొంది. ‌

సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయం
సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయం

సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. పురావ‌స్తు శాఖ ఆదేశాల మేర‌కు ఆల‌య ఈవో బ‌ల్ల నీల‌కంఠం ఆధ్వ‌ర్యంలో అర్చ‌కులు రాంబాబు శ‌ర్మ‌, వెంక‌న్న శ‌ర్మ‌, విన‌య్ శ‌ర్మ‌, ద‌త్తు ఆధ్వ‌ర్యంలో స్వామి వారికి అభిషేకాలు నిర్వ‌హించారు. బాలా త్రిపుర సుంద‌రీ దేవికి కుంకుమ పూజ‌లు నిర్వ‌హించారు. ఆల‌యంలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ అందించారు.

సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో శివలింగ జీర్ణోద్ధరణ ప్రక్రియ మే 29 ప్రారంభం అయింది. దీనివల్ల గర్భాలయ దర్శనాలను నిలిపివేశారు. అయితే భక్తుల సౌకర్యార్థం నంది మండపంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. అక్కడ అర్చక స్వాములు బాల త్రిపుర సుందరి సమేత భీమేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు.

అయితే శివ‌లింగ జీర్ణోద్ధ‌ర‌ణ ప్ర‌క్రియ పూర్తి కావ‌డంతో తిరిగి చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. భ‌క్తులంతా ఇప్పుడు మూల విరాట్ ద‌ర్శ‌నాలు చేసుకోవ‌డానికి వీలుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్క‌డ‌కి భ‌క్తులు వ‌స్తారు. దేశంలోనే ప్ర‌సిద్ధి చెందిన పంచ‌రామ క్షేత్రాల్లో సామర్ల‌కోట పంచ‌రామం ఒక‌టి.

పంచారామాలెన్ని...అవి ఎక్కడెక్కడ ఉన్నాయి?

దేశంలో పంచారామాలు ఐదు ఉన్నాయి. ఈ పంచారామాలూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే ఉండ‌టం విశేషం. అందువల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు పంచ‌రామాల‌ సందర్శనం చాలా సులువుగా ఉంటుంది. వందల ఏళ్ల నాటి శిల్పకళలు, వేల ఏళ్ల చరిత్రతో పంచారామాలు ఉంటాయి. ఈ పంచారామాలన్నీ ప్రకృతి సోయగాల వడిలోనే ఉన్నట్టు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఈ పంచారామాలే ముఖ్యమైనవి. ఐదు పంచారామాల్లో రెండు తూర్పు గోదావరి, రెండు పశ్చిమ గోదావరి, ఒకటి గుంటూరు జిల్లాలో ఉన్నాయి.

తూర్పు గోదావరిలో ఉన్న పంచారామాలు

తూర్పుగోదావరి జిల్లాలో రెండు పంచారామాలు ఉన్నాయి. అవి ఒకటి సామర్లకోటలో కుమారబీమారామం, మరొకటి రామచంద్రాపురానికి సమీపంలో ద్రాక్షారామం.‌

సామర్లకోటలో ఉన్న కుమారభీమారామం క్షేత్రంలో కుమారస్వామి స్వయంగా ఇక్కడి‌ లింగాన్ని ప్రతిష్టంచారు.‌ అందువల్ల కుమారారామమని పిలుస్తారు.‌ చాళుక్య రాజు భీముడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అందువల్ల కుమార భీమారామంగా పేరు గాంచింది. చైత్ర, వైశాఖ మాసాల్లోని సూర్యకాంతి ఉదయం సమయంలో స్వామి వారి పాదాలనీ, సాయంత్రపు వేళలల్లో అమ్మవారి పాదాలను తాకుతాయి. దీన్ని ఇక్కడి విశేషంగా భావిస్తారు.

తూర్పుగోదావరిలో ఉన్న మరొక పంచారామం ద్రాక్షారామం. రామచంద్రాపురానికి సమీపంలో ఉన్న ద్రాక్షారామం అత్యంత ముఖ్యమైన శైవక్షేత్రం.‌ ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం చేశారు. అందువల్ల ఈ ప్రాంతానికి ద్రాక్షారామం పేరు వచ్చిందని అక్కడి వారు అంటారు. భీమేశ్వరస్వామి సహచరి మాణిక్యాంబను అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. అలాగే దక్షిణ కాశిగా, త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ద్రాక్షారామం ఆలయాన్ని పేర్కొంటారు.

పశ్చిమ గోదావరిలో ఉన్న పంచారామాలు

పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పంచారామాలు ఉన్నాయి. అవి ఒకటి భీమవరానికి సమీపంలో ఉన్న సోమరారామం, మరొకటి పాలకొల్లులో ఉన్న క్షీరారామం.

భీమవరానికి సమీపంలో ఉన్న గునుపూడి గ్రామంలోని శివక్షేత్రమే సోమరామం. ఇక్కడ శివలింగం చంద్రుని చేత ప్రతిష్టింపచేయడంతో ఈ క్షేత్రానికి సోమారామమనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే చంద్రని కళలతో పాటు పౌర్ణమి, అమావాస్యలకు మధ్య శివలింగం రకరకాల రంగుల్లోకి మారడంతో భక్తులు అద్భుతంగా భావిస్తారు.‌ఈ ఆలయాన్ని కూడా చాళుక్య రాజు భీముడు నిర్మించాడు. అందువల్ల ఈ పంచారామాన్ని భీమారామం అని కూడా పిలుస్తారు.

పాలకొల్లులో ఉన్న క్షీరారామాన్ని సాక్షాత్తూ శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్టించారు. అందువల్ల ఇక్కడి స్వామికి రామలింగేశ్వరుడనే పేరు స్థిరంగా ఉంది.‌ శివలింగం పైభాగం కాస్త మొనదేలి ఉంటుంది. అందువల్ల స్వామివారికి కొప్పురామలింగేశ్వరుడు అనే పేరు ఉంది. ఇక్కడి శివలింగం తెల్లగా పాలరంగులో ఉంటుంది. అందువల్ల స్వామివారిని క్షీరారామలింగేశ్వరుడు అని కూడా పిలుస్తారు.

గుంటూరులో ఉన్న పంచారామం

గుంటూరులోని అమరావతిలో ఒక పంచారామం ఉంది. దాన్ని అమరారామం అంటారు. ఇక్కడ లింగాన్ని సాక్షాత్తూ ఇంద్రుడే ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి.‌ ఇక్కడి అమరలింగేశ్వరుడు పది అడుగులకు పైబడి ఉంటుంది. అందువల్ల స్వామిని పూర్తిగా దర్శించుకోవాలంటే రెండంతస్తుల మెట్లను ఎక్కాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner