Three Capitals Confusion : ఏపీ రాజధాని ఏది ? అదే గందరగోళం.. అవే సందేహాలు-monumental confusion continues on three capitals in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Three Capitals Confusion : ఏపీ రాజధాని ఏది ? అదే గందరగోళం.. అవే సందేహాలు

Three Capitals Confusion : ఏపీ రాజధాని ఏది ? అదే గందరగోళం.. అవే సందేహాలు

HT Telugu Desk HT Telugu
Feb 22, 2023 12:32 AM IST

Three Capitals Confusion : ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. 2014లో రాష్ట్ర విభజన జరిగినా.. నేటికీ ఏపీ రాజధాని ఇది అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. నాడు అమరావతి.. మొన్న మూడు రాజధానులు... నేడు కేవలం విశాఖ... ఇలా రోజుకో భిన్నాభిప్రాయం... ప్రజల్లో మరింత గందరగోళం సృష్టిస్తోంది. అయితే... ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ నే క్యాష్ చేసుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజధాని అంశంలో కొనసాగుతున్న వివాదంతోనే... విపక్షాలను ఇరుకున పెట్టే వ్యూహాన్ని వైఎస్సార్సీపీ అమలు చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

ఏపీ రాజధానిపై గందరగోళం
ఏపీ రాజధానిపై గందరగోళం

Three Capitals Confusion : రాష్ట్రాలు - రాజధానులు.. ! చదువుల్లో సామాజిక శాస్త్రానికి సంబంధించిన ఈ పాఠం ఆసక్తికరంగా ఉంటుంది. రాష్ట్రం పేరు చెప్పగానే రాజధాని ఏదో ఠక్కున చెప్పేందుకు విద్యార్థులు పోటీ పడతారు. తెలివైన విద్యార్థులు దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను తడుముకోకుండా చెప్పేస్తారు. ఏంటీ .. ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు.. ? భారత్ లో ఉన్నది 29 రాష్ట్రాలు అయితే 28 రాష్ట్రాలు అని అంటున్నారేంటి అనే కదా ? మీ సందేహం నిజమే. కానీ.. అన్ని రాష్ట్రాల కేపటిల్స్ ఏవో అందరూ ఇట్టే చెప్పగలుగుతారు కానీ... ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదీ అంటే మాత్రం... కొద్ది సేపు ఆలోచనలో పడిపోతారు. అమరావతా ? విశాఖపట్నమా ? అని కొద్ది సేపు థింక్ చేస్తారు. విద్యార్థులు, సామాన్యుల సంగతి పక్కన పెడితే.. ఏపీ రాజధాని ఏది అనే ప్రశ్నకు... రాజకీయ నేతల నుంచి ఒకే సమాధానం రావడం లేదు. రాష్ట్ర రాజధానిపై అదే గందరగోళం. అవే సందేహాలు. రోజుకో భిన్నాభిప్రాయం.. !

ప్రజా జీవనానికి సంబంధించి ఏదైనా సమస్య ఏర్పడితే.. ఎక్కువ మంది సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం దొరకాలని ఆశిస్తారు. కానీ.. అదే సమస్య, దాని పరిష్కారం.. ఎన్నికల రాజకీయాలతో ముడిపడి ఉంటే మాత్రం.. పొలిటికల్ పార్టీలు దాన్ని అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తాయి. సమస్యను సాల్వ్ చేయడంలో కన్నా... దాన్ని కొనసాగించి, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఈ వైఖరి తప్పుకదా ? అని సాధారణ ప్రజలు అనుకోవచ్చు. కానీ ఓట్ల సాధనే లక్ష్యంగా సాగుతోన్న ప్రస్తుత రాజకీయాల్లో... తప్పు, ఒప్పుల గురించి పార్టీలు ఆలోచించాలని మనం ఆశించడం కూడా అత్యాశే అయిపోయింది.

"తాము మోసపోయామని ప్రజలను ఒప్పించడం కన్నా.. ప్రజల్ని మోసం చేయడమే సులువు" అని అమెరికాకు చెందిన ప్రముఖ రచయిత మార్క్ వెయిన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల విషయంలో కొనసాగుతున్న రాజకీయాలు... వెయిన్ మాటలను ఇప్పుడు స్పురణకు తెస్తున్నాయి. ఏపీకి మూడు రాజధానులు ఉండాలా ? లేక సంప్రదాయంగా ఒకే రాజధాని.. అది కూడా అమరావతే అయి ఉండాలా ? ఈ అంశాల్లోనే ఇప్పుడు వివాదం కొనసాగుతోంది. విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు అధికార పార్టీ ఓ వైపు వేగంగా పావులు కదుపుతోండగా... మరోవైపు విపక్షాలు మాత్రం ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతే అని నినదిస్తున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అమరావతి రాజధాని స్టేటస్ ను తొలగించలేవని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు.. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి.. మేము త్వరలోనే విశాఖ నుంచి గవర్నెన్స్ మొదలు పెడతామన్నట్లుగా... సీఎం జగన్ సర్కార్ చకచకా ఏర్పాట్లు చేసుకుంటూ పోతోంది.

మంత్రి వ్యాఖ్యలతో.. మరింత గందరగోళం

విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ ఆతృతగా ఉన్నారని.. ప్రభుత్వ తీరుని చూస్తే స్పష్టం అవుతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో మాట్లాడుతూ... ఇదే విషయాన్ని క్లియర్ చేసిన ముఖ్యమంత్రి జగన్.. విశాఖ నుంచే ప్రభుత్వం పనిచేస్తుందని తేల్చి చెప్పారు. ఆ వెంటనే.. బెంగళూరులో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సన్నాహక సమావేశంలో... ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధాని గందరగోళాన్ని మరింత పెంచాయి. మూడు రాజధానులపై కొత్త పల్లవి ఎత్తుకున్నారాయన. అసలు మూడు రాజధానులు అనేదే తప్పుగా వెళ్లిన సందేశమని... అది సమాచార లోపం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన విశాఖపట్నం నుంచే జరుగుతుందని.. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను చూస్తే.. రాజధానిగా అదే ఉత్తమంగా అభివర్ణించారు. ఇన్నాళ్లూ... వైఎస్సార్సీపీ చెబుతూ వస్తోన్న మూడు రాజధానుల కాన్సెప్ట్ కు.. బుగ్గన వ్యాఖ్యలు వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. 3 రాజధానులు అనేదీ ఏమీ లేదని.. విశాఖ ఒక్కటే ఏపీ కేపిటల్ అని.. బుగ్గన మాటల ద్వారా అర్థం అవుతోంది. మంత్రి మాటలు... రాజధానిపై వివాదాన్ని మరింత ముదిరేలా చేశాయి. అమరావతి కోసం కొట్లాడుతోన్న కృష్ణా, గుంటూరు రైతులకి వారి వాదాన్ని బలపరుచుకునే ఆయుధాన్ని అందించాయి.

2019లో ఏపీకి 3 రాజధానుల ఫార్ములా ప్రకటించిన వైఎస్సార్సీపీ సర్కార్... ఇందుకోసం రూపొందించిన చట్టాన్ని వివాదాలు, కోర్టు ఆదేశాలతో 2021లో వెనక్కి తీసుకుంది. మూడు ప్రాంతాలకు న్యాయం చేసేలా.. మూడు రాజధానుల కోసం సమగ్రమైన చట్టాన్ని మళ్లీ తీసుకొస్తామని ఆ సందర్బంగా సీఎం జగన్ ప్రకటించారు. వివాదం కోర్టుకి చేరగా... అమరావతినే రాజధానిగా కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. 6 నెలల్లో అభివృద్ధి చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ అంశం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. ఇలా.. కేపిటల్ అంశం న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నా... అధికార పార్టీ విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తుండటం.. అనేక సందేహాలు రేపుతోంది. నిజంగానే అన్నంత పనిచేస్తుందా ? లేక పెట్టుబడులను ఆకర్షించడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా అనే క్వశ్చన్స్ ఉత్పన్నం అవుతున్నాయి. ఈ అంశాన్ని ఇలాగే వచ్చే ఎన్నికల వరకు నాన్చుతుందా ? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

"మూడు రాజధానాలు అనేది మిస్ కమ్యూనికేషన్" అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించిన రెండో రోజే... ప్రభుత్వ ప్రధాన సలహాదారు.. సీఎం జగన్ కి అత్యంత ఆప్తులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మూడు రాజధానులకే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. సజ్జల చెబితే.. జగన్ చెప్పినట్లే అనే టాక్ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. దీన్నిబట్టి చూస్తే.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసినా... మూడు రాజధానుల అంశాన్ని వైఎస్సార్సీపీ ఇప్పట్లో పక్కన పెట్టే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అధికార పార్టీ ప్లానేంటో.. విపక్షాలకూ అంతుచిక్కడం లేదని విశ్లేషకులు అంటున్నారు. విశాఖ.. మూడు రాజధానాలు.. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి.. ! ఇలా మూడు అంశాలతో ముందడుగు వేస్తున్న వైఎస్సార్సీపీ... వ్యూహాత్మకంగా రాజధాని అంశంలో గందరగోళాన్ని కొనసాగిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తద్వారా టీడీపీ, జనసేన పార్టీలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని.... వచ్చే ఎన్నికల వరకు ఇదే స్ట్రాటజీతో సాగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఫ్యాన్ గాలి వీచేలా అడుగులు..

అమరావతే రాజధానిగా ఉండాలని వాదించే వారికి.. గట్టి సమాధానం చెబుతోంది.. వైఎస్సార్సీపీ. 7,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సింగపూర్ కన్నా 10 రెట్లు పెద్ద రాజధాని అని చంద్రబాబు గ్రాఫిక్స్ డిజైన్లతో ఆర్భాటం చేశారని.. ప్రభుత్వ కాంప్లెక్స్, శాసనసభ, సెక్రటేరియట్ తప్పిస్తే.. అక్కడ ఎలాంటి ఇతర నిర్మాణాలు చేపట్టలేదని విమర్శిస్తోంది. అమరావతి రాజధాని కాన్సెప్ట్ ద్వారా చంద్రబాబు సామాజిక వర్గం లబ్ధి పొందిందని... భూముల సేకరణ నుంచి వారికి ప్రయోజనాలు కల్పించే వరకు అన్ని అంశాల్లో "కుల" కోణం ఉందని ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా... ఇతర ప్రాంతాల్లో ఈ వాదనను గట్టిగా వినిపిస్తూ... ప్రజల మద్దతు తమవైపే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. చంద్రబాబు చేసిన తప్పు తాము చేయమని... ఒకే దగ్గర కేంద్రీకృతమయ్యే అభివృద్ధికి తాము వ్యతిరేకమని చెబుతూ... దానికి ప్రత్యామ్నాయ ఆలోచనే మూడు రాజధానులు అని చెబుతోంది. తద్వారా ఒకే సమయంలో చంద్రబాబుకి చెక్ పెట్టడంతో పాటు.. మిగతా ప్రాంతాల్లో పూర్తిగా ఫ్యాన్ గాలి వీచేలా అడుగులు వేస్తోంది.

ఈ మొత్తం పరిణామాలను చూస్తే... హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అమరావతిలో ఇప్పటికిప్పుడు రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిద్దంగా లేదన్నది స్పష్టం అవుతోంది. అదే సమయంలో... మూడు రాజధానాల విధానంపైనా పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు తొలి అడుగులు పడుతున్న సందర్భాన్నీ.. జగన్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తంమీద... రాజధాని విషయంలో ఏర్పడిన గందరగోళాన్నే తమకు అనుకూలంగా మలుచుకొని.. దాన్నే వచ్చే ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా ప్రయోగించాలని జగన్ పార్టీ భావిస్తోందని.. ఏపీ రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి... అంతా అధికార పార్టీ ప్లాన్ ప్రకారమే జరుగుతుందా.. ? లేక జగన్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే వ్యూహాలను ప్రతిపక్షాలు సిద్ధం చేస్తాయా ? ఈ రాజకీయ చదరంగంలో ప్రజలు చివరికి ఎవరివైపు నిలుస్తారో చూడాలి.. !

టీ20 వరల్డ్ కప్ 2024