ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. ఐఎండీ అంచనాల మేరకు... రేపు (మే 13) దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. అండమాన్ సముద్రమే కాకుండా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తాజా బులెటిన్ ద్వారా వెల్లడించింది.
దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు,అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇవి మరింతగా ముందుకు సాగేందుకు తదుపరి 4- 5 రోజులు వాతావరణం మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది.
సాధారణంగా జూన్ 1 లేదా మొదటి వారం నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా విస్తరించి… వర్షాలు కురుస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. మే 27న నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ప్రాథమికంగా అంచనా వేసింది. గత ఏడాది మే 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేయగా... మే 30న తీరాన్ని తాకాయి.
ఇక ఈ ఏడాది రుతుపవన కాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కొద్దిరోజుల కిందటే వెల్లడించింది. ఐఎండీ అంచనాల మేరకు… విస్తారంగా వర్షాలు కురిస్తే…. తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు తరలివచ్చే అవకాశం ఉంటుంది.
దక్షిణ అండమాన్ సముద్రాన్ని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 14న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలోని అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు లేదా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఇక తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల, నిజామాబాద్, రంగారెడ్డి, సిరిసిల్ల, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
సంబంధిత కథనం