రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలిపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మిగతాజిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడేఅవకాశం ఉంది. సోమవారం రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం సాయంత్రం 7 గంటల వరకు చిత్తూరు జిల్లా దామోదర మహారాజపురంలో గరిష్టంగా 49 మిల్లీ మీటర్లు, ప్రకాశం జిల్లా డీజీ పేటలో 47.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 41.3 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొనకనమిట్ల, పల్నాడు జిల్లా రావిపాడులో 40.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీఎస్‌డీఎంఏ రూపొందించిన "స్మార్ట్ హీట్ అలెర్ట్ కార్డ్"ను శనివారం స్పెషల్ సీఎస్ జి.జయలక్ష్మి ఆవిష్కరించారు. బీట్ ది హీట్ కార్యక్రమంలో భాగంగా ఈ స్మార్ట్ కార్డు రూపొందించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరు ఉష్ణోగ్రతల హెచ్చరిక రంగులు, వాటి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. వీటితో పాటు ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు కార్డులో తెలియజేశామని.. జయలక్ష్మి వివరించారు.
రియల్ టైమ్‌లో అన్ని ప్రాంతాల్లోని ఉష్ణోగ్రత వివరాలు కోసం.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని జయలక్ష్మి సూచించారు. గంట గంటకు స్థానికంగా ఉష్ణోగ్రతల అంచనా వివరాలు అందులో ఉంటాయని చెప్పారు. ఆ వివరాల ప్రకారం అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే.. వడదెబ్బ బారిన పడకుండా బయట పడొచ్చు అని వివరించారు.
మామూలుగా అయితే.. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకుతాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయి. రుతుపవనాలు కేరళను తాకినప్పటి నుంచి ఏపీలో వాతావరణం మారుతుంది. జూన్ మూడో వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది 4 రోజులు ముందే రుతుపవనాలు రానున్నాయి. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచే వర్షాలు పుంజుకునే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు.
మే 20వ తేదీ తరువాత దక్షిణ అండమాన్ సముద్రానికి రుతుపవనాలు తాకాల్సి ఉంది. అయితే.. ఈసారి వారం ముందుగా 13వ తేదీన ప్రవేశించాయి. తరువాత నాలుగైదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, దక్షిణ, మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని ఐఎండీ వివరించింది.
సంబంధిత కథనం