YSRCP : వైసీపీకి పోతుల సునీత రాజీనామా - అదే బాటలో కీలక నేతలు..?
వైసీపీకి మరో షాక్ తగిలింది. పోతుల సునీత పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి తన రాజీనామా లేఖను అందజేశారు. పార్టీలోని పదవులతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలోనే భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తానని సునీత తెలిపారు. ఎమ్మెల్సీగానే కాకుండా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అంశంపై మండలి కార్యదర్శికి కూడా లేఖను రాశారు.
చీరాలకు చెందిన పోతుల సునీత తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత మరో మూడేళ్లు సమయం ఉండగానే ఆమె పదవికి రాజీనామా చేశారు. ఇదే సమయంలో వైసీపీ గూటికి చేరారు. 2021లో ముఖ్యమంత్రి జగన్ సునీత ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.
2014 ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుంచి నుంచి టీడీపీ తరపున పోతుల సునీత పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమంచి చేతిలో ఓడారు. కొద్ది రోజులకు ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ టీడీపీలోకి వచ్చారు. దీంతో నియోజకవర్గంలో సమీకరణాలు మారిపోయాయి. సునీతతో విభేదాలు మొదలయ్యాయి. చంద్రబాబు ఈ విభేదాలకు చెక్ పెట్టేందుకు సునీతకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు. అయితే 2019 ఫలితాలతో చీరాలలో ఇవ్వేషన్స్ మారాయి. ఆమంచితో పాటు పోతుల సునీత కూడా ఫ్యాన్ పార్టీ(వైసీపీ)లో చేరారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ఇక్కడ్నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరామ్ కూడా టీడీపీని వీడి… వైసీపీలో చేరారు.
మరికొందరు నేతలు…?
మరోవైపు పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా వైసీపీని వీడుతారని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఎంపీల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాల గిరి వంటి వారు వైసీపీని వీడారు.
వైసీపీని వీడే నేతలు టీడీపీ, బీజేపీ లేదా జనసేనలో చేరుతారని తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు కొందరు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పలు కార్పొరేషన్లలోని కార్పొరేటర్లు, మేయర్లు పార్టీని వీడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ చేరికల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు సాధించి ఘోర ఓటమిని మూట గట్టుకుంది వైసీపీ. అప్పట్నుంచి పార్టీలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. చాలా మంది నేతలు సైలెన్స్ అయిపోయారు. ఈ క్రమంలోనే… కొందరు నేతలు పార్టీని వీడుతారని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
టాపిక్