Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, తొలి ప్రాధాన్యత ఓట్లలో తేలని ఫలితాలు-mlc election counting votes continues in ap telangna states results in first priority votes inconclusive ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, తొలి ప్రాధాన్యత ఓట్లలో తేలని ఫలితాలు

Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, తొలి ప్రాధాన్యత ఓట్లలో తేలని ఫలితాలు

Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలోని ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు, తెలంగాణలోని కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ స్థానాలకు జరిగిన ఎన్నికలకు నేడు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు, తొలి ప్రాధాన్యత ఓట్లలో తేలని ఫలితాలు

Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో జరుగుతోంది.

ఉభయ గోదావరి జిల్లాల్లో

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొత్తంగా 700 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ ప్రక్రియలో పనిచేస్తున్నారు. 243 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదు కాగా, వీటిలో 42 ఓట్లు చెల్లుబాటుకాలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్‌ అభ్యర్థి డి.వి.రాఘవులు మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లు వేరుచేసి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. రౌండ్ల వారీగా చెల్లిన ఓట్లను లెక్కించనున్నారు. మొదటి రౌండ్‌లో 10,783 చెల్లుబాటైన ఓట్లు రాగా, రెండో రౌండ్‌లో 13,929, మూడో రౌండ్‌లో 11,870, నాలుగో రౌండ్‌లో 13,377, ఐదో రౌండ్‌లో 13,163, ఆరో రౌండ్‌లో 14,783 చొప్పున చెల్లుబాటైన ఓట్లు వచ్చాయి.

ఇక కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 371 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు అవ్వగా, వీటలో 55 ఓట్లు చెల్లుబాటుకాలేదు.

ఉత్తరాంధ్ర టీచర్ స్థానంలో

ఉత్తరాంధ్ర టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్థులు ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యతా ఓట్లను లెక్కింపు చేపట్టారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో పీఆర్‌టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు 7,210 ఓట్లు వచ్చాయి. ఏపీటీఎఫ్‌, కూటమి అభ్యర్థి రఘువర్మకు 6,835 ఓట్లు, పీడీఎఫ్‌ అభ్యర్థి విజయగౌరికి 5810 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

మొత్తంగా 20,783 ఓట్లకు గాను 19,813 ఓట్లు మాత్రమే చెల్లినవి అని అధికారులు గుర్తించారు. ఈ ముగ్గురి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొనడంతో రాత్రి 8 గంటల వరకు గెలుపు ఎవరిదో తెలిసే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణలో ఓట్ల లెక్కింపు

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంతో పాటు టీచర్ నియోజకవర్గానికి కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.

కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ ఓట్ల లెక్కింపు

కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో చేపట్టారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్లు ఏర్పాట్లు చేశారు. ముందుగా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను 50 చొప్పున కట్టలు కట్టారు. అనంతరం మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం అభ్యర్థుల వారీగా విభజించారు. ఆ తర్వాత లెక్కింపు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 3,55,159 మంది పట్టభద్రుల ఓటర్లలో 2,50,328 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు.

టీచర్స్ స్థానానికి 15 మంది అభ్యర్థుల పోటీ పడ్డారు. టీచర్స్ ఓటర్లు 27088 మందికి గాను 24968 ఓట్లు పోలయ్యాయి. ఓట్ల లెక్కింపునకు మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ సిబ్బందిని నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి నల్గొండలోని వేర్‌హౌసింగ్‌ గోదాంలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది.

  • చెల్లుబాటు అయిన ఓట్లు- 23, 641
  • చెల్లని ఓట్లు- 494
  • గెలుపు కోటా- 11822 గా నిర్దారణ
  • శ్రీపాల్ రెడ్డి -6035
  • అలుగుబెల్లి నర్సిరెడ్డి-4820
  • హర్షవర్ధన్ రెడ్డి-4437
  • పూల రవీందర్-3115
  • పులి సరోత్తం రెడ్డి-2289

గెలుపు కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం