Guntakallu Mla: తనపై వార్తలు రాస్తే పట్టాలపై పడుకొోబెడతానని వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
Guntakallu Mla: తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే పట్టాలపై పడుకోబెడతానంటూ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియాలో తన గురించి చెడుగా రాయొద్దని, దుష్ప్రచారం చేస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టడానికి వెనుకాడనని వార్నింగ్ ఇచ్చారు.
Guntakallu Mla: మాజీ మంత్రి, గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రెచ్చిపోయారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే వారిని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మీడియాలో తన గురించి వార్తలు రాసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గుమ్మనూరు జయరాం, తనపై వచ్చిన ఆరోపణల గురించి తన ముందే ప్రశ్నించాలన్నారు.
తనమీద, తన తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని హెచ్చరించారు. ఎవరికైనా సందేహాలు ఉంటే తనముందే ప్రశ్నలు వేయాలని వెనుక మాట్లాడొద్దని హెచ్చరించారు. ఏ ఛానల్ వారు అయినా తనను అడగాలని, తనకు ఎవరితో శతృత్వం లేదని, పట్టాలపై పడుకోబెడతారని తన మీద రాశారని, తాను తప్పు చేయనని, తన మీద, తన తమ్ముడి మీద వెనుక నుంచి అనొద్దని, నేరుగా అంటే సరిదిద్దుకుంటానని చెప్పారు.
తనపై వార్తలు రాసే ముందు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఏ ఛానల్ అయినా తనను ప్రశ్నించవచ్చని, ఫ్రెండ్లీగానే తనతో మాట్లాడొచ్చని, తాను వెళ్లిపోయిన తర్వాత దుష్ప్రచారం చేయొద్దన్నారు.
తన గురించి వార్తలు రాసే వారిపై పట్టాలపై పడుకోబెట్టడానికి కూడా తాను సిద్ధం గా ఉన్నానని చెప్పారు. తప్పు చేయకుండా తనమీద, తమ్ముడి మీద వార్తలు రాయొద్దని హెచ్చరించారు.
గుమ్మనూరు జయరాం 2019-22 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కర్నూలు జిల్లాలో భూముల కబ్జాతో పాటు జూదం నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలుపొందారు.