VMC Works: బెజవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం.. అవసరం లేని పనులకు కోట్లలో ఖర్చు…-misuse of 15th finance commission funds in bezawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vmc Works: బెజవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం.. అవసరం లేని పనులకు కోట్లలో ఖర్చు…

VMC Works: బెజవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం.. అవసరం లేని పనులకు కోట్లలో ఖర్చు…

Sarath Chandra.B HT Telugu

VMC Works: పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, తాగునీటి సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్ని విజయవాడలో పప్పు బెల్లాల మాదిరి ఖర్చు పెట్టేశారు. అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒక రూపంలో నిధుల్ని వెచ్చించాలనే లక్ష్యంతో వంద కోట్ల నిధుల్ని వృధా చేశారు.

విజయవాడ కార్పొరేషన్‌లో ఇంజనీరింగ్ పనుల మాయాజాలం, 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం

VMC Works: విజయవాడలో 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం యథేచ్ఛగా సాగింది. 2021-26 మధ్య ఐదేళ్ల కాలానికి 15వ ఆర్థిక సంఘం విజయవాడ రూ.124కోట్ల రుపాయల నిధుల్ని మంజూరు చేసింది. నగరంలో మౌలిక సదుపాయాలు, తాగునీటి సదుపాయాలను మెరుగు పరచడానికి వీటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిర్దేశిత పనుల కోసం మాత్రమే 15వ ఆర్థిక సంఘం నిధుల్ని వెచ్చించాల్సి ఉండటంతో కార్పొరేషన్‌ అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు అతి తెలివి ప్రదర్శించారు.

నగరమంతటా మంచి నీటి సరఫరా…

విజయవాడ నగరం మొత్తానికి చాలా కాలం క్రితమే రక్షిత మంచినీటి సరఫరా పైప్‌లైన్ల నిర్మాణం జరిగింది. కృష్ణా నదిలో ఉన్న హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి నగరంలోని మెజార్టీ ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతుంది. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు కృష్ణా జలాలు సరఫరా జరుగుతుంది. కొండ ప్రాంతాల్లో సైతం ఓవర్‌ హెడ్ ట్యాంకుల ద్వారా ఇంటింటికి మంచినీటి సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో30-40 ఏళ్ల క్రితమే తాగునీటి పైప్‌లైన్లను నిర్మించిన ప్రాంతాల్లో కొత్త పైప్‌లైన్ల నిర్మాణం ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు.

2021లో 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులు కేటాయించిన వెంటనే పాత పైప్‌లైన్ల స్థానంలో కొత్త వాటిని మార్చే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. విజయవాడ నగర పాలక సంస్థలో తిష్టవేసిన కొందరు కార్పొరేటర్లు ఇందులో చక్రం తిప్పారు. ఆర్థిక సంఘం నిధులతో చేపట్టాల్సిన పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించి ముందే కమిషన్లు కొట్టేశారు.ఒక్కో పనిని చిన్న చిన్న పనులగా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగించేశారు.

పైప్‌లైన్లు ఉన్న చోటే కొత్త లైన్ల నిర్మాణం...

విజయవాడ పాతబస్తీ మొత్తానికి దశాబ్దాల క్రితమే మంచినీటి పైప్‌లైన్లు ఉన్నాయి. వీటిలో ఇంటింటికి తాగునీరు సరఫరా అవుతోంది. నగరంలోని కొన్ని ప్రాంతాలకు రైల్వే ట్రాకుల దిగువ నుంచి భారీ పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ లైన్లు ప్రస్తుతం ఉన్న రోడ్లకు దాదాపు 10-12 అడుగుల దిగువున ఉన్నాయి.

15వ ఆర్థిక సంఘం నిధులతో హెడ్‌డిపిఇ పైప్‌లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో జిఐ,కాస్ట్‌ ఐరన్‌, ఏసీ పైప్‌లైన్లను నీటి సరఫరా కోసం ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాలకు సరిగా నీటి సరఫరా జరగడం లేదని, నీరు కలుషితం అవుతోందనే కారణాలతో కొత్తగా హెచ్‌డిపిఇ పైప్‌లైన్లను ఏర్పాటుకు అమోదం తెలిపారు.

జనంపై రీ కనెక్షన్ల భారం...

విజయవాడ నగరంతటా మంచి నీటి సరఫరా సక్రమంగానే ఉన్నా ఆర్థిక సంఘం నిధుల్ని ఖర్చు చేయడం కోసమే కొత్త పైప్‌లైన్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పైప్‌లైన్లను సమూలంగా మార్చకుండా ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ మార్చేసి బిల్లులు పెట్టడం మొదలు పెట్టారు. నీటి వృధాను అరికట్టడం, కాలం చెల్లిన పైప్ లైన్లను మార్చడమే లక్ష్యమైతే రైల్వే లైన్ల దిగువన కూడా పనులు చేపట్టాల్సి ఉండగా వాటిని అలాగే వదిలేశారు. పాత లైన్లకే కొత్త పైప్‌ లైన్ కనెక్షన్ ఇచ్చి పనులు పూర్తి చేసేశారు.తాజాగా ప్రతి ఇంటికి రూ.3వేల రుపాయలు రీ కనెక్షన్ ఛార్జీ నిర్ణయించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

కోట్లలో కమిషన్లు...

విజయవాడ కార్పొరేషన్‌లో అధికార పార్టీగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లు 15వ ఆర్థిక సంఘం నిధుల పనుల్ని దక్కించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కేటయించిన పనులకు బిల్లులు రాకముందే కాంట్రాక్టర్ల నుంచి వాటాలు వసూలు చేసినట్టు చెబుతున్నారు. మార్చి నెలాఖరులోకా పనులు పూర్తి చేయకపోతే బిల్లులు మురిగిపోయే ప్రమాదం ఉండటంతో ఆగమేఘాలపై వాటిని పూర్తి చేస్తున్నారు. జనానికి అవసరం లేని పనుల్ని ప్రతిపాదించిన కార్పొరేటర్లు తాజాగా బిల్లుల కోసం అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు.

గుట్టుగా అభివృద్ధి పనులు..

నగరంలో చేపట్టే పనుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ చేసే విధానాలకు గత ఐదేళ్ళుగా తిలోదకాలిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే పనుల సమాచారం స్థానికులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్పొరేషన్‌ వెబ్‌సైట్లలో కూడా అభివృద్ధి పనుల సమాచారం అందుబాటులో ఉంచడం లేదు. స్థానిక సంస్థలు చేపట్టే పనుల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడంలో ఆంతర్యం అంతు చిక్కడం లేదు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం