Generic Medicines: ఏపీలో 15 రోజుల్లోనే జనరిక్‌ మెడిసిన్ స్టోర్లకు అనుమతులు, మండలానికో జనరిక్ స్టోర్‌ ఏర్పాటు…-minister satyakumar says permissions will be given to generic medicine stores within 15 days ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Generic Medicines: ఏపీలో 15 రోజుల్లోనే జనరిక్‌ మెడిసిన్ స్టోర్లకు అనుమతులు, మండలానికో జనరిక్ స్టోర్‌ ఏర్పాటు…

Generic Medicines: ఏపీలో 15 రోజుల్లోనే జనరిక్‌ మెడిసిన్ స్టోర్లకు అనుమతులు, మండలానికో జనరిక్ స్టోర్‌ ఏర్పాటు…

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 21, 2024 10:50 AM IST

Generic Medicines: ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన 15రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తామని, మందుల విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జనరిక్ స్టోర్ల ఏర్పాటుకు యువత ముందుకు రావాలని మంత్రి సత్యకుమార్‌ యాదవ్ పిలుపునిచ్చారు.

జనరిక్‌ మందుల దుకాణాపై  అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్
జనరిక్‌ మందుల దుకాణాపై అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

Generic Medicines: ఆంధ్రప్రదేశ్‌లో జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేసుకున్న 15రోజుల్లోనే అనుమతులు మంజూరు చేయనున్నట్టు మంత్రి సత్యకుమార్ అసెంబ్లీలో ప్రకటించారు.  జ‌న‌రిక్ మందుల ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిందని,  పేద‌ల ఆరోగ్యం ప‌ట్ల గ‌త ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేదని సత్యకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో 215 ప్రధానమంత్రి భార‌తీయ జ‌న ఔష‌ధి కేంద్రాలు మాత్ర‌మే ఉన్నాయని, ప్ర‌తి మండ‌ల కేంద్రంలో జ‌నౌష‌ధి కేంద్రాల్ని ప్రారంభించాల‌ని సిఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించినట్టు అసెంబ్లీలో ప్రకటించారు. 

మందుల ధరలు, జనరిక్ దుకాణాల్లో జరుగుతున్న మోసాలపై ఏసీ అసెంబ్లీలో సభ్యులు  ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎమ్మార్పీ ధరల పేరుతో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.  సభ్యులు ఆందోళనపై స్పందించిన వైద్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రధానమంత్రి మోదీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి భారతీయ జనౌష‌ధి కేంద్రాలు దేశవ్యాప్తంగా 13,822 ఉండ‌గా, ఆంధ్రప్రదేశ్ లో 215 మాత్రమే ఉన్నాయ‌ని, ఇది పూర్తిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యమేన‌ని ఆరోపించారు. 

రాష్ట్రంలో జ‌న‌రిక్ మందుల‌పై శాసనసభలో స‌భ్యుల‌డిగిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌త్య‌కుమార్ స‌మాధానం చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌త్యేకంగా 325 జ‌న‌రిక్ మందుల దుకాణాలుండ‌గా, ఇందులో ప్ర‌ధానమంత్రి జ‌నౌష‌ధి కేంద్రాలు 215, అన్న సంజీవ‌ని మొద‌లైన‌వి 73, ఎన్‌జిఓలు మ‌రియు ఇత‌ర సంస్థ‌లకు న‌డుపుతున్న‌వి 37 ఉన్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం 34,761 చిల్ల‌ర మందుల దుకాణాల్లో బ్రాండెడ్ మందుల‌తో పాటు జ‌న‌రిక్ మందుల్ని కూడా విక్ర‌యిస్తున్నార‌న్నారు. 

జ‌న‌రిక్ మందుల గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న త‌క్కువ‌గా ఉన్న మాట వాస్త‌వ‌మేన‌ని, ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో డాక్ట‌ర్లు కూడా జ‌న‌రిక్ మందుల్ని రాయ‌డంలేద‌ని మంత్రి వివ‌రించారు. అన్ని మండ‌ల కేంద్రాల్లో ప్ర‌ధాన‌మంత్రి జ‌నౌష‌ధి కేంద్రాల్ని ప్రారంభించేలా యువ‌త‌ను ప్రోత్స‌హించాల‌ని ముఖ్య‌మంత్రి  చంద్ర‌బాబు నాయుడు ఇటీవ‌ల నిర్ణ‌యం తీసున్నార‌న్నార‌ని మంత్రి స‌భ‌కు తెలిపారు. త‌ద్వారా యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌న్న‌ది ప్ర‌భుత్వం భావిస్తోంద‌న్నారు. 

అన్ని ప్ర‌భుత్వ ఆరోగ్య సంస్థ‌ల్లో వినియోగం కోసం 560 ర‌కాల అనుమ‌తి పొందిన అత్య‌వ‌స‌ర మందుల జాబితా ప్ర‌కారం జ‌న‌రిక్ మందుల్ని సేక‌రించి, స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌న్నారు. జ‌న‌రిక్ మందుల దుకాణాల లైసెన్స్ లకు అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తూ 15 రోజుల్లో లైసెన్స్‌లు మంజూరు చేయ‌డం ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ జ‌న‌రిక్ మందుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స‌మ‌ర్ధ‌వంత‌మైన చ‌ర్య‌ల్ని వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటోంద‌న్నారు. 

జ‌న‌రిక్ మందుల నాణ్య‌త గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి పెద్ద ఎత్తున ప్ర‌చార(ఐఇసి-ఇన్ఫ‌ర్మేష‌న్, ఎడ్యుకేష‌న్‌, క‌మ్యూనికేష‌న్‌) కార్య‌క్ర‌మాన్ని క్ర‌మం త‌ప్ప‌కుండా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు, జ‌నౌష‌ధి దుకాణాల్ని ప్రారంభించేందుకు గాను నిరుద్యోగ ఫార్మాసిస్టుల్ని ప్రోత్స‌హించాల‌ని ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలిచ్చామ‌ని మంత్రి పేర్కొన్నారు. 

అన్ని ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో జ‌న‌రిక్ మందుల్ని మాత్ర‌మే రాస్తార‌ని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మాత్ర‌మే బ్రాండెడ్ మందుల్ని కొనుగోలు చేయాల‌న్న ఆదేశాలిచ్చామ‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స‌భ‌కు వివ‌రించారు. 17 టీచింగ్ ఆసుప‌త్రుల‌తో పాటు జిల్లా ఆసుప‌త్రులు, ఏరియా ఆసుప‌త్రులు, క‌మ్యూనిటీ హెల్త్ సెంటర్ల‌లో కూడా జ‌న‌రిక్ మందుల దుకాణాల్ని ప్రారంభిస్తున్నామ‌న్నారు. 

జనరిక్ మందులపై అపోహలు వద్దు..

జ‌న‌రిక్ మందుల విష‌యంలో ప్ర‌జ‌ల్లో అపోహ‌లున్న‌మాట వాస్త‌వ‌మేన‌ని, బ్రాండెడ్, జ‌న‌రిక్ మందుల మ‌ధ్య తేడా ఎక్కువ ఉంద‌నే అపోహ కూడా ఉంద‌న్నారు. అయితే బ్రాండెడ్‌, జ‌న‌రిక్ మందుల మ‌ధ్య ఎటువంటి తేడా లేద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆయా మందుల కంపెనీలు రీసెర్చ్ మ‌రియు డెవ‌ల‌ప్మెంట్ (ఆర్ అండ్ డి) చేసి, రిపీటెడ్ గా క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేయ‌డం వ‌ల్ల ఆ ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. 

మందుల పేటెంట్ అయ్యాక ఎవ‌రైనా స‌రే జ‌న‌రిక్ మందుల్ని త‌యారు చేసుకోవ‌చ్చ‌న్నారు. జ‌న‌రిక్ మందుల్లోని ప‌దార్థాలు, బ‌లం, డోసేజ్‌, ప‌నితీరు బ్రాండెడ్ మందుల‌తో స‌మానంగానే ఉంటాయ‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌న్నారు. దేశంలో 2 ల‌క్ష‌ల 10 వేల కోట్ల రూపాయ‌ల మేర విలువైన‌ మందులు విక్ర‌యిస్తుండ‌గా, రాష్ట్రంలో 10 వేల కోట్ల రూపాయ‌ల మేర విక్రయాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇందులో కేవ‌లం 7 శాతం మాత్ర‌మే జ‌న‌రిక్ మందుల విక్ర‌యం ఉండ‌డం దౌర్భాగ్య‌మ‌ని మంత్రి అన్నారు. 

బ్రాండెడ్ మందుల విక్రయిస్తే చర్యలు..

బ్రాండెడ్ మందుల‌తో పోలిస్తే జ‌న‌రిక్ మందుల ధ‌ర‌లు చాలా త‌క్కువ‌గా ఉంటాయ‌ని, 30 నుండి 70 శాతం మేర త‌క్కువ ధ‌ర ఉంటాయ‌న్నారు. దీనిపై ప్ర‌త్యేక దృష్టిని సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

బ్రాండెడ్ మందుల ఎంఆర్‌పీ విష‌యంలో స‌రైన నిబంధ‌న‌లు లేనందున ఈ తేడాలుంటున్నాయ‌న్నారు. అందువ‌ల్ల డిస్కౌంట్ రేట్ల‌లో మందుల దుకాణాల్లో అమ్ముతున్నార‌న్నారు. జ‌న‌రిక్ మందుల దుకాణాల్లో క‌చ్చితంగా జనరిక్ మందుల్ని మాత్రమే అమ్మాలనీ, బ్రాండెడ్ మందుల్ని అమ్మే వారిపై డ్ర‌గ్ కంట్రోల్ అథారిటీ (డిసిఎ) ద్వారా క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకుంటామ‌ని మంత్రి స‌భ‌కు వివ‌రించారు.

ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో జ‌న‌రిక్ మందులే ఇస్తార‌ని, ఎపిఎంఎస్ ఐడిసి కూడా జ‌న‌రిక్ మందుల్నే కొనుగోలు చేస్తుంద‌ని, అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మాత్ర‌మే డిసెంట్ర‌లైజ్డ్ ఫండ్ ద్వారా కొంత మొత్తాన్ని ఖ‌ర్చు చేసి బ్రాండెడ్ మందులు కొనుగోలు చేసేందుకు గాను సూప‌రింటెండెంట్ల‌కు ఆదేశాలిచ్చామ‌న్నారు. పేద‌ల జేబు నుండి ఖ‌ర్చు త‌క్కువ ఉండాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి వివ‌రించారు.

Whats_app_banner