AP GBS Cases : జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన చెందొద్దు, రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స- మంత్రి సత్యకుమార్
AP GBS Cases : గులియన్ బారీ సిండ్రోమ్ వ్యాధిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సత్యకుమార్ అన్నారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

AP GBS Cases : ఏపీలో గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) వ్యాధి కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో మంత్రి సత్యకుమార్...ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జీబీఎస్ రోగులకు సరిపడా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇది అంటువ్యాధి కాదని, చికిత్స తీసుకోకుండానే చాలా వరకు తగ్గిపోతుందని చెప్పారు.
43 జీబీఎస్ కేసులు
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 43 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రస్తుతం 17 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వ్యాధి సోకడానికి కారణాలు, రోగుల పూర్వాపరాలను పరిశీలించాలని వైద్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు. కేసులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. జీబీఎస్ బాధితులకు అందించేందుకు తగిన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాధి సోకినా 85 శాతం చికిత్స అవసరం లేకుండా తగ్గిపోతుందన్నారు. 15 శాతం మాత్రం ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నామన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా
గుంటూరు, అనంతపురం, కడప, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖ జీజీహెచ్లలో 749 ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అదనంగా మరో 469 ఇంజెక్షన్లు ఉన్నాయని, వీటిలో ఇతర జీజీహెచ్లకు తరలిస్తున్నామన్నారు. అవసరం మేరకు మరిన్ని ఇంజెక్షన్లను కొనుగోలు చేస్తామన్నారు. వ్యాధి బారిన పడినవారికి చికిత్స అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్ ధర రూ.20 వేలు ఉంటుందన్నారు. వ్యాధి సోకిన వారికి ఇలాంటి ఇంజెక్షన్లు రోజుకు ఐదు... మొత్తంగా ఐదు రోజుల పాటు అందించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించడంలేదని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు తగినన్ని ఇంజెక్షన్లను అందుబాటులో ఉంచుతుందని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
అన్ని జీజీహెచ్ లో ఇంజెక్షన్లు అందుబాటులో
జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఎవరూ ఆందోళన చెందవద్దని వైద్యారోగ్య శాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. ఎవరైనా తిమ్మిర్లు, నడవలేని స్థితిలో ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. జీబీఎస్ రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. అన్ని జీజీహెచ్ ల్లో ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
సంబంధిత కథనం