APSRTC : ఆర్టీసీలో 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్ల ఖాళీలు.. అసెంబ్లీలో మంత్రి కీలక ప్రకటన
APSRTC : ఏపీఎస్ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉంది. ఆర్టీసీలో ఏకంగా 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్ల కొరత ఉందని స్వయంగా మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు అసెంబ్లీలో వెల్లడించారు.
ఏపీఎస్ ఆర్టీసీలో 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్ల కొరత ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని చెప్పారు. ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈహెచ్ఎస్ ద్వారా సదుపాయాలు అన్నీ అందడం లేదని.. రిఫరల్ సరిగా జరగడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.
గత ప్రభుత్వంలో బస్టాండ్‌ల అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవడంతో నిర్వహణ కష్టంగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారు. బస్టాండ్‌ల ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో ఆన్ కాల్ డ్రైవర్లు సరైన విధానం కాదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్లుగా అనుభవం లేని వారిని తీసుకురావడం వల్ల ప్రమాదాలు జరిగాయని గుర్తుచేశారు.
హోంమంత్రి ఫైర్..
గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే రాష్ట్రంలో నేరాలు పెరిగాయని.. హోంమంత్రి అనిత ఆరోపించారు. శాసన మండలిలో అనిత మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పరామర్శకు వెళ్లిన తమపైనే కేసులు పెట్టారని గుర్తుచేశారు. దిశ చట్టం గురించి గొప్పగా చెబుతున్నారు.. అసలు ఆ చట్టం ఉందా? అని ప్రశ్నించారు. దిశ యాప్, చట్టం పని చేస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరిగాయన్నారు.
అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేస్తున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటల్లో నేరస్థుల్ని పట్టుకుంటున్నారని వివరించారు. ముచ్చుమర్రి కేసు విషయంలో నిందితులకు శిక్ష వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందని అనిత స్పష్టం చేశారు.
కేబినెట్ భేటీ వాయిదా..
ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం సోమవారం సచివాలయంలో జరగాలి. కానీ.. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు చనిపోయారు. దీంతో సీఎం చంద్రబాబు తమ స్వగ్రామం నారావారిపల్లె వెళ్లారు. సోమవారం సాయంత్రం వరకు చంద్రబాబు అక్కడే ఉంటారు. ఈ కారణంగా మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.
బుధవారం కేబినెట్ సమావేశం జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. నవంబర్ 20వ తేదీన వెలగపూడిలోని సచివాలయం బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్‌లో.. సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ అవుతుందని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రకటన విడుదల చేశారు.