Minister Narayna: నెల్లూరు వేలంలో మద్యం దుకాణాలు దక్కించుకుని, అనుచరులకు ఇచ్చేసిన మంత్రి నారాయణ
Minister Narayna: ఏపీ మద్యం దుకాణాల వేలంలో ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రమంతటా మద్యం దుకాణాల సిండికేట్లను రాజకీయ నాయకులు శాసిస్తే, నెల్లూరులో మంత్రి నారాయణ తరపున వేసిన దరఖాస్తులకు దక్కిన మద్యం దుకాణాలను అనుచరులకు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.
Minister Narayna: ఏపీ మద్యం దుకాణాల వేలం ప్రక్రియలో ఊహించినట్టే రాజకీయమే పై చేయి సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎక్కువ భాగంగా స్థానిక సిండికేట్లకే దక్కాయి. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరులో మద్యం దుకాణాల వేలంలో దరఖాస్తు ఫీజుగా రూ.2కోట్లను మంత్రి నారాయణ ఖర్చు చేశారు. దాదాపు 100 అప్లికేషన్లను పలు దుకాణాలకు సమర్పించారు.
మంత్రి నారాయణ తరపున ఆయన అనుచరులు 100 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో మూడు దరఖాస్తులకు లాటరీలో దుకాణాలు దక్కాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కోసం పనిచేసిన అనుచరుల కోసం నారాయణ స్వయంగా సొంత డబ్బు ఖర్చు చేసినట్టు ప్రచారం జరిగింది. లాటరీలో వచ్చిన మద్యం దుకాణాలను క్రియాశీలకంగా పనిచేసిన అనుచరులకు అప్పగించారు.
ఎన్నికల్లో నారాయణ విజయం కోసం పని చేసిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల కోసం సొంత డబ్బులు రూ.2 కోట్లతో వేలంలో పాల్గొన్నారు. వీటిలో మూడు దరఖాస్తులకు లాటరీలో దుకాణాలు లభించాయి. దీంతో ఒక్కో దుకాణాన్నిఆరుగురికి అప్పగించినట్టు నెల్లూరు నాయకులు చెబుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో పెట్రోల్ పంప్ బాయ్‌కు దక్కిన దుకాణం…
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని 80వ నంబరు దుకాణం కోసం ఎన్. రామకృష్ణ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. గత పదేళ్లుగా పెనుగంచి ప్రోలు పెట్రోల్ బంకులో బాయ్‌గా పనిచేస్తున్నారు. కొంతమంది మిత్రులతో కలిసిదరఖాస్తు చేసుకుంటే లాటరీలో అతడిని అదృష్టం వరించింది.
ఏపీలో వ్యాపారానికి తెలంగాణ వారికి దుకాణాలు
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలోని 6వ నంబరు దుకాణం, పెనుగంచిప్రోలు లోని 8వ నంబరు దుకాణాలకు లైసెన్సులు తెలంగాణ వాసులకు దక్కాయి. వత్సవాయిలో మూడు దుకాణాల లైసెన్సులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారికి దక్కాయి. 36వ సంబరు దుకాణం ఖమ్మం జిల్లా బానాపురానికి చెందిన చెరుకుపల్లి సత్యనారాయయణకు, 7వ నంబరు దుకాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బండి అనూషకు, 81వ సంబరు దుకాణం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన తల్లపల్లి రాజుకు లభించాయి.
విజయవాడ దుకాణాలు ఇండోర్ వ్యాపారులకు..
విజయవాడలోని 14, 18వ నంబరు దుకా ణాలు మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన రాహుల్ శివరే, ఆర్పిత్ శివరేకు లభించాయి. మచిలీపట్నంలో ఓ దుకాణాన్ని కర్ణాటకకు చెందిన మహేష్ బాతే, మరో దుకాణాన్ని ఢిల్లీ వాసి లోకేశ్ చంద్ దక్కించుకున్నారు. ఒడిశాకు చెందిన మద్యం వ్యాపారులకు శ్రీకా కుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో రెండేసి దుకాణాలు వచ్చాయి.