Minister Lokesh : నిమ్మరసం పేరుతో రూ. 28 లక్షలు దోచేశారు..! దోపిడీకి హద్దులేదా జగన్..? - మంత్రి లోకేశ్ ఫైర్
Minister Nara Lokesh On YS Jagan : వైఎస్ జగన్ పై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో నిమ్మకాయ నీళ్ల పేరుతో రూ. 28 లక్షలను దిగమింగేశారని ఆరోపించారు.
Minister Nara Lokesh On YS Jagan : వైసీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. దోపిడీకి హద్దులేదా జగన్ అని ప్రశ్నించారు. జనం సొమ్ము అయితే దిగమేస్తారా..? అని నిలదీశారు,
వైసీపీ పాలనలో గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి నిమ్మకాయ నీళ్ల కోసమంటూ రూ. 28 లక్షలు దోచేశారని మంత్రి లోకేశ్ ఆరోపించారు. ఆ టిడ్కో ఇల్లు ఒక్కో పేద లబ్ధిదారుడికి మంజూరు చేయడానికి 3 లక్షల నుంచి 4 లక్షలు దండుకున్నారని దుయ్యబట్టారు.
గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి 70 లక్షలు బిల్లులు చేసుకోవడానికి గడ్డం గ్యాంగ్ విశ్వప్రయత్నాలు చేసిందని నారా లోకేశ్ ఆరోపించారు. అమృత్ పథకం కింద పనులు చేయకుండానే కోట్లు కొల్లగొట్టేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో గడ్డం గ్యాంగ్ గుడివాడ నియోజకవర్గాన్ని గుల్ల చేసిందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే అంటూ 'X' ఖాతాలో లోకేశ్ పోస్ట్ చేశారు.
మంత్రి లోకేశ్ సమీక్ష…
మధ్యాహ్నభోజన పథకం అమలుపై సంబంధిత అధికారులతో గురువారం సెక్రటేరియట్ లో మంత్రి లోకేశ్ సమీక్షించారు. గత వైసీపీ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల కాంట్రాక్టర్లకు రూ.112.5 కోట్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు రూ.66 కోట్లు బకాయిలు పెట్టడంతో గుంటూరులోని కొన్ని పాఠశాలల్లో సరఫరా నిలిచిపోయిందని తెలుసుకుని షాక్ అయ్యానని మంత్రి అన్నారు.
కోట్లలో బకాయిలుపెట్టి విద్యార్థులకు గుడ్లు, చిక్కీలు అందకుండా చేసింది నాటి జగన్ ప్రభుత్వమే అని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాకే వీటి పంపిణీ ఆగిపోయిందని తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు.
జగన్ సర్కారు పెట్టిన బకాయిలను అతిత్వరలో చెల్లిస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. విద్యార్థులకు గుడ్లు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు అందరూ సహకరించాలని మంత్రి కోరారు.