Fee Reimbursement: కాలేజీలకే ఫీజు రియింబర్స్‌మెంట్ చెల్లింపు, విధివిధానాలు రూపొందించాలని మంత్రి నారా లోకేష్ ఆదేశం
Fee Reimbursement: ఏపీలో గందరగోళంగా మారిన ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని గాడిన పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలేజీల ఖాతాలకే ఫీజు రియింబర్స్ చేసేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారుల్ని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.
Fee Reimbursement: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న జగనన్న విద్యాదీవెన పథకాన్ని గాడిన పెట్టేందుకు కొత్త ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎన్నికల కోడ్‌ను సాకుతో విద్యార్ధులకు గత మార్చిలో బటన్ నొక్కినా బ్యాంకు ఖాతాలకు విద్యా దీవెన డబ్బులు చేరలేదు. దీంతో ప్రతి విద్యార్ధికి సగటున రూ.50వేల నుంచి లక్షన్నర వరకు ఫీజులు బకాయి ఉండిపోయాయి.
పరీక్షలు రాయడానికి, కోర్సులు పూర్తైన వారు సర్టిఫికెట్లు తీసుకోడానికి కొద్ది నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు సొంత డబ్బులు చెల్లించి వార్షిక పరీక్షలకు హాజరవుతున్న వైనం వెలుగు చూసింది. ఫీజులు చెల్లిస్తే తప్ప పరీక్షలను అనుమతించమని కాలేజీలు తెగేసి చెబుతుండటంతో విద్యార్ధులు అప్పులు చేసి బకాయిలు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఫీజు రియింబర్స్‌మెంట్( గతంలో జగనన్న విద్యాదీవెన) పథకంపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు.
లోపాలతో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్‌పై సమీక్ష నిర్వహించిన లోకేష్ కాలేజీలకు ఫీజులు నేరుగా చెల్లించేందుకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు ఆదేశించారు. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ కు విధివిధానాలు రూపొందించాలని సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గిపోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
విద్యాదీవెన, వసతిదీవెనకు సంబంధించి గత ప్రభుత్వం రూ. 3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థల్లో నిలచిపోయాయని లోకేష్ అన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో డ్రగ్స్ ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని అన్నారు.
డ్రగ్స్ పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీచేసేందుకు కసరత్తు చేపట్టాలని అన్నారు.
రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్, ఎగ్జామినేషన్ షెడ్యూలు, క్యాలండర్ తయారుచేసి, నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటనకు చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గత అయిదేళ్లుగా ప్రవేశాలు తగ్గిపోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయమై సీరియస్ గా దృష్టిసారించి, అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు తదితర అంశాలన్నింటినీ డ్యాష్ బోర్డులో పొందుపర్చాలని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏమేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కు కళాశాలల ఎంపిక, రాష్ట్రంలో శ్రీ పొట్టిశ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల ఏర్పాటు చేసే అంశాలపై సమావేశంలో సమీక్షించారు.
మరోవైపు ఇప్పటికే అప్పులు చేసి ఫీజులు చెల్లించిన విద్యార్ధులు కొత్త ప్రభుత్వం ట్యూషన్ ఫీజు బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తుందోనని విద్యార‌్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా చోట్ల కాలేజీలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేశాయి. గత ప్రభుత్వంలో ఫీజుల్ని తల్లుల ఖాతాలకు జమ చేసేది. ఇప్పుడు విద్యార్ధులు కట్టేసిన డబ్బులు వాపసు ఇస్తారా లేదా అనే దానిపై కూడా ఆందోళన నెలకొంది.
సంబంధిత కథనం