Nadendla Manohar : త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఉచిత ఇళ్ల స్థలాలు-సూపర్ సిక్స్ పథకాలపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
Minister Nadendla Manohar : రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు, ఉచిత ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లుతో పాటు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎక్కడైనా నాయకులు, కార్యకర్తలకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే అన్నారు.
Minister Nadendla Manohar : "రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నాం, ఉచిత ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు అందించనున్నాం. అలాగే తల్లికి వందనం పథకాన్ని ,ఇతర సూపర్ సిక్స్ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయనున్నాం" అని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసైనికుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ప్రతీ గ్రామంలో రోడ్లు
'ఒకే సారి వెయ్యి రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం మనది. ఒకటో తేదీ కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నాం. రైతులకు పంట డబ్బు 48 గంటల్లో అకౌంట్లో వేశాం. దాదాపు 90 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం- 2 పథకం ద్వారా అందించాం' అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయని, ఏలూరులో దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పూర్తయిందన్నారు.
గత ప్రభుత్వ సమయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నాదెండ్ల ఆరోపించారు. ఒక్క నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు, పోలవరం ముందుకు కదల్లేదు, అమరావతి నిర్మాణం జరగలేదన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూటమి ప్రభుత్వం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. 'ఈరోజు అధికారంలోకి వస్తామని రాజకీయం చేయలేదు, ప్రజల సమస్యలపై పోరాడాం, సమాజం కోసం పోరాటం చేశాం, గుంతలు లేని ఆంధ్ర ప్రదేశ్ కోసం పోరాటం చేశాం, ఈరోజు అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారు' అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
అభిప్రాయ భేదాలు సహజమే
"భారతదేశంలో 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన పార్టీ జనసేన, అసెంబ్లీలో రెండో స్థానంలో ఉన్న పార్టీ మనది, పార్లమెంట్ లో మన సభ్యులు ఉన్నారు, సాక్షాత్తూ ప్రధాని మంత్రి మోదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాయకత్వం గురించి అనేక సార్లు పొగిడారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ విస్తరించింది, ప్రతీ గ్రామంలో మన జెండా ఎగురుతుంది, ప్రతీ గ్రామంలో జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు, వారందరికీ బలమైన గొంతుగా పవన్ కల్యాణ్ నిలబడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా నాయకులు, కార్యకర్తలకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండటం సహజమే, కానీ వాటిని బహిరంగంగా తీసుకెళ్లకండి, ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసేలా పనిచేస్తాం. ఒకే సారి అందరికీ న్యాయం జరగకపోవచ్చు, కానీ కచ్చితంగా గుర్తింపు ఉండేలా ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారు"- జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్
పరస్పర గౌరవం అందరికీ గుర్తింపు
చాలా చోట్ల జనసైనికులకు, నాయకులకు అన్యాయం జరుగుతుందని తమ దృష్టికి వచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దీనిని కచ్చితంగా పరిష్కరిస్తాం, క్షేత్రస్థాయిలో పదవుల్లో మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే, ఇతర నాయకులు నిర్ణయం తీసుకుంటే సరిపోదన్నారు. పరస్పరం గౌరవం ఇచ్చి అందరికీ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన నేతలతో అన్నారు.
సోషల్ మీడియాతో జాగ్రత్త
"రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 928 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 24 కోట్ల 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం జనసేన పార్టీ ద్వారా పవన్ కల్యాణ్... 5 లక్షల చొప్పున బీమా అందేలా చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసాగా ఉండటం కోసం రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 8 మంది, ఎన్టీఆర్ జిల్లా నుంచి 1, కృష్ణా జిల్లా నుంచి 9 మందికి మొత్తం 18 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ప్రమాదవశాత్తూ మరణించిన జనసైనికుల కుటుంబాలకు పవన్ కల్యాణ్ తరపున చెక్కులు అందిస్తున్నాము.సోషల్ మీడియాలో బాధ్యతగా ఉండండి. సోషల్ మీడియా రెండు వైపులా పదును ఉన్న కట్టి లాంటిది, అనవసరంగా మనల్ని ఇబ్బంది పెట్టినా... గొడవలు పెట్టాలని చూసే వారికి దూరంగా ఉండండి, కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి." - జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
సంబంధిత కథనం