Lokesh on AP Mega DSC: వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామన్న మంత్రి లోకేష్
Lokesh on AP Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు.
Lokesh on AP Mega DSC: ఆంధ్రప్రదేశ్ డిఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేష్ ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డిఎస్సీ నియామకాలు పూర్తి చేేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు. ఉపాధ్యాయుల సమస్యలు, నియమకాలు, టీచర్ల విధులపై సభలో పలువురు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానమిచ్చారు.
ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్ జాప్యం కావడంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. 1994 ముందు టీచర్ రిక్రూట్‌మెంట్ జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ నియమాకాలు జరిగేవని, 1994 నుంచి రాష్ట్ర స్థాయిలో డిఎస్సీ జరుగుతోందన్నారు. 1994 నుంచి ఇప్పటి వరకు 15 డిఎస్సీలు టీడీపీ హయంలోనే నిర్వహించినట్టు చెప్పారు. 2019 వరకు మొత్తం 2.20లక్షల పోస్టులను భర్తీ చేస్తే వాటిలో 1.80లక్షల పోస్టుల్ని టీడీపీ ప్రభుత్వం భర్తీ చేసినట్టు లోకేష్ చెప్పారు.
గత ప్రభుత్వంలో డిఎస్సీ 2024 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగుల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలకు ముందు 6100పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డిఎస్సీకి సంతకం చేశారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు.
ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారుే.
డిఎస్సీ నోటిఫికేషన్‌పై పల్లా శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ స్పందించారు. డిఎస్సీపై లీగల్ ఒపినియన్ అడిగామని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని, న్యాయవివాదాలు తావివ్వకుండా నోటిఫికేషన్ ఇస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోపు డిఎస్సీ పూర్తి చేస్తామన్నారు. 1994 నుంచి డిఎస్సీపై పడిన కేసులు అన్ని పరిశీలించి, పకడ్బందీగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నామన్నారు. గతంలో డిఎస్సీ నియామకాల్లో తలెత్తిన వివాదాలు పరిశీలిస్తున్నామని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
నిరుద్యోగుల ఆశలు వృధా చేయకుండా, చిత్తశుద్దితో నోటిఫికేషన్ జారీ చేసి జీవో జారీ చేస్తామన్నారు. ఉపాధ్యాయుల విధులపై జీవో 117కు ప్రత్యామ్నయాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. ఉపాధ్యాయులతో చర్చలకు తలుపులు మూసేయడం లేదు.ప్రతి శుక్రవారం 11 నుంచి 3గంటల వరకు ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకోడానికి కేటాయించినట్టు చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు రాకపోతే కమిషనర్ ఫోన్ చేసి వారిని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన్ని తొలగిస్తామని సభలో ప్రకటించారు. ఉపాధ్యాయులను బోధనా విధులకు మాత్రమే పరిమితం చేస్తామన్నారు.
సంబంధిత కథనం