అనంతలో రెన్యూ పవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు వేస్తున్న పునాదిరాయి... భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి లాంటిదని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న రూ.22వేలకోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు.
రెన్యూ పవర్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నమన్నారు. రూ.22వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ గ్రిడ్‌లకు శక్తినివ్వడమే కాకుండా... నిరుద్యోగ యువత ఆశయాలకు ఆజ్యం పోస్తుంది, రేపటి వెలుగుకు దారి చూపుతుందన్నారు.
ఏపీలో ఉత్పత్తి అయ్యే ప్రతి మెగావాట్ విద్యుత్ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తుందని, భారతదేశాన్ని ముందుండి నడిపించే శక్తిరథానికి ఆంధ్రప్రదేశ్ సారధ్యం వహిస్తుందన్నారు. భారతదేశంలో గ్రీన్ పవర్ హౌస్ గా మారుతున్న ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన రెన్యూ చైర్మన్, సిఇఓ సుమంత్ సిన్హాకు కృతజ్ఞతలు తెలిపారు.
పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి వివరించారు. 8నెలల వ్యవధిలో క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించగలిగినట్టు చెప్పారు. వీటిలో టాటా పవర్: 7,000 MW | రూ. 49,000 కోట్లు, NTPC గ్రీన్ హైడ్రోజన్: రూ.1.86 లక్షల కోట్లు, వేదాంత సెరెంటికా 10,000 MW | రూ.50,000 కోట్లు, SAEL ఇండస్ట్రీస్: 1,200 MW | రూ.6,000 కోట్లు, బ్రూక్‌ఫీల్డ్: 8,000 MW | రూ.50,000 కోట్లు ఉన్నాయన్నారు.
ఇవి పెట్టుబడులు మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో పాటు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనకు ఏపీీ సిద్ధంగా ఉందనడానికి ఇది నిదర్శనం. అన్నారు. అనంతపురం రెన్యూ పునరుత్పాదక ఇంధన కాంప్లెక్స్ రెండు దశల్లో నిర్మితమవుతుందని తొలిదశలో రెన్యూ సంస్థ 587మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పారు.
వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై మొత్తంగా 22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుందని, ఈ సముదాయం పెద్దఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుందని చెప్పారు.
త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచి తీసుకువస్తామని, బెంచి ప్రారంభానికి ప్రధాని మోడీజీని రాయలసీమకు తెస్తామని చెప్పారు. పనివత్తిడిలో ఉన్నప్పటికీ ఇటీవల అమరావతి పనుల పునఃప్రారంభానికి రాష్ట్రానికి వచ్చారని ఏపీ ప్రజల కోర్కెలను మోడీ తీరుస్తున్నారని దేశంలో రాబోయే అయిదేళ్లలో 500 గిగావాట్ల రెన్యువబుల్ ఎనర్జీ సాధించాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీజీ పనిచేస్తున్నారని చెప్పారు.
సంబంధిత కథనం