Minister Lokesh : నా వెంట్రుక కూడా పీకలేరని ఎరిగినందుకే ఈ పరిస్థితి- జగన్ 2.0కి లోకేశ్ కౌంటర్
Minister Lokesh : ఈసారి జగన్ 2.0 చూస్తారని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ 1.0 అరాచకం నుంచే ఇంకా బయటపడలేదన్నారు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరని అంటే ఉన్న 1.0 కూడా పీకేశారన్నారని ఎద్దేవా చేశారు.
Minister Lokesh : వైసీపీ కార్యకర్తల కోసం జగన్ 2.0 చూస్తారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. 'ప్రజలు జగన్ 1.0 అరాచకం నుంచే ఇంకా బయటకు రాలేదు, విధ్వంసం మర్చిపోలేదు. ఇలాగే నా వెంట్రుక కూడా పీకలేరు అని ఎగిరారు. ప్రజలు ఉన్న 1.0 కూడా పీకేశారు. జగన్ కి, ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమేమి చేస్తాం. ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అసెంబ్లీకి రావటం ఆయన బాధ్యత. కనీసం పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల పై మాట్లాడాలి' అని లోకేశ్ అన్నారు.
'పులివెందుల ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ప్రశ్న.. మీరు 5 ఏళ్లలో తెచ్చిన పెట్టుబడులు ఎన్ని? మేము 8 నెలల్లో తెచ్చిన పెట్టుబడులు ఎన్ని అనేవి చర్చించటానికి సిద్ధమా? చర్చకు రెడీనా జగన్ ?' -లోకేశ్
దిల్లీ పర్యటనలో
'దిల్లీలో పలువురు కేంద్రమంత్రులను కలిశాను. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించాం. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉండాలని కోరాను. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరాను. అనంతపురంలో డిఫెన్స్ పరిశ్రమలకు గల అనుకూలతల గురించి రక్షణశాఖ మంత్రికి వివరించాం.
దిల్లీలో ఉక్కు శాఖ మంత్రిని కలిసి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్యాకేజ్ ఇచ్చిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పాను. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు వచ్చిన భయమేమీ లేదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్రమంత్రే చెప్పారు. నిర్వహణ సరిగా లేకే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నష్టాలు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నాం'-మంత్రి లోకేశ్
20 లక్షల ఉద్యోగాల హామీ
ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించామని మంత్రి లోకేశ్ తెలిపారు. వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించామన్నారు. విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని కోరామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆరా తీశారని తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. 20లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.
రాష్ట్రంలో ఐటీ సేవలు, గ్రీన్ హైడ్రోజన్, రెన్యువబుల్ ఎనర్జీ విస్తరిస్తామని మంత్రి లోకేశ్ అన్నారు. ఆలయాల్లో ఇతర మతాచారాలు పాటించేవారిని తప్పించడం సాధారణమే అన్నారు. ప్రశాంత్ కిశోర్ తో భేటీపై స్పందిస్తూ...ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకే కలిశానన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో విద్యావ్యవస్థ దారుణంగా దెబ్బతిందన్నారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తగ్గారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో 45 లక్షల నుంచి 32 లక్షలకు పిల్లలు తగ్గిపోయారుని మంత్రి లోకేశ్ చెప్పారు.
సంబంధిత కథనం