రాష్ట్రంలో విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో… పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ పరీక్షలపై ఆరా తీశారు.
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి లోకేశ్ మరో కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహణ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేస్తామన్నారు. తద్వారా విద్యాప్రమాణాలను మెరుగుపరుస్తామని వివరించారు. అంతిమంగా రాబోయే నాలుగేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తేవడమే ప్రభుత్వం లక్ష్యమని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
యూనివర్సిటీల నుంచి విద్యార్థులు బయటకు వచ్చేటప్పటికే సరైన నైపుణ్య శిక్షణ పొందాలని మంత్రి లోకేశ్ అధికారులకు సూచించారు. ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలు పలు అంశాలను ప్రస్తావించారు.
విద్యార్థులకు అవసరమైన నైపుణ్యశిక్షణ కార్యక్రమాలను కాలేజ్ స్థాయిలోనే పెద్దఎత్తున చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ యూనివర్సిటీల విసి పదవులకు సెర్చి కమిటీల ద్వారా సాధ్యమైనంత త్వరగా పేర్లు సూచించాలని ఆదేశించారు. వివిధ యూనివర్సిటీల చట్టాలను సమీక్షించి అతి త్వరలో ఏకీకృత చట్టాన్ని తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఫారిన్ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులపై సమీక్షించారు.
ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియపై మంత్రి లోకేశ్ ఆరా తీశారు. 27 వేల మందికిపైగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలను ఆన్ లైన్ విధానంలో పారదర్శకంగా చేపట్టినట్లు వెల్లడించారు. ఇదివరకెన్నడూ లేనివిధంగా 4 వేలమందికి పైగా టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ లుగా ప్రమోషన్లు కూడా ఇస్తున్నామన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్ ఫర్ యాక్ట్ మేరకు పూర్తి పారదర్శకంగా బదిలీలు, ప్రమోషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అక్షర ఆంధ్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.