తిరుపతిలో విద్యార్థుల మధ్య జరిగిన ఓ వ్యక్తిగత గొడవను టీడీపీపై రుద్ది పబ్బం గడుపుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చూస్తున్నారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. దళిత సోదరులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.
ఈనెల 15వ తేదీ రాత్రి తిరుపతిలో జేమ్స్ అనే దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి, దాడి చేసిన ఘటనకు సంబంధించి ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం A1 యశ్వంత్, A-2 కిరణ్, A-3 జగ్గ, A-4 లలిత్, A-5 సాయి గౌడ్, A-6 వంశీ, A7 రూపేష్ ఇంకా మరికొందరు నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు.
నిందితుల్లో జగదీష్ అలియాస్ జగ్గ, లలిత్ అలియాస్ లలిత్ గోపాల్, నాని, సాయి గౌడ్ లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులని మంత్రి లోకేశ్ తెలిపారు. ఉండు రూపేష్ రెడ్డి అలియాస్ రూపి, సాయి కిరణ్ కుమార్ రెడ్డి భూమన అభినయ్ రెడ్డి వద్ద పనిచేసే వారని, వంశీ అసియాస్ చోట బ్లేడ్ ఎంపీ గురుమూర్తి అనుచరుడని అన్నారు.
వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ వాళ్లు జేమ్స్ ను కిడ్నాప్ చేసి, దాడి చేశారంటూ వైఎస్ జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి ఘటనలో ఇప్పటికే కొన్ని అరెస్టులు జరిగాయి, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా కూటమి ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.
"రాజకీయంగా జగన్ హిస్టరీ యావత్తు ఆసాంతం రక్తచరిత్రే. బాబాయిని బాత్రూమ్ లో గొడ్డలివేటుతో లేపేసి బాబు చేతిలో కత్తి పెట్టి నాడు అడ్డగోలు రాతలు రాయించారు. అసలు నిజమేంటో సొంత చెల్లెళ్లతో సహా రాష్ట్ర ప్రజలంతా ఆలస్యంగా తెలుసుకున్నారు.
అధికారంలో ఉండగా డాక్టర్ సుధాకర్ మొదలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళిత సోదరులను ఊచకోత కోసిన జగన్... ప్రతిపక్షంలోనూ అవే పోకడలు కొనసాగిస్తున్నారు. తిరుపతి ఘటనలో వాస్తవాలను, జగన్ కుట్రలను గుర్తించి యావత్ దళిత సమాజం అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను" అని మంత్రి లోకేశ్ అన్నారు.
"తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది.
అధికారపార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్షసాధింపు చర్యల్లో మునిగితేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి.
పోలీస్‌స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమేకాదు, ఫిర్యాదు దారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది. జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదునుకూడా స్వీకరించలేని పరిస్థితి.
తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను" అని వైఎస్ జగన్ అన్నారు.
సంబంధిత కథనం