AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్-minister kandula durgesh says govt provides incentives to tourism projects with industrial status ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్

AP Tourism : ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్

Bandaru Satyaprasad HT Telugu
Jan 05, 2025 09:43 PM IST

AP Tourism : ఏపీలో సినీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సీఎం చంద్రబాబు పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించారని గుర్తుచేశారు. పరిశ్రమల తరహాలో టూరిజం ప్రాజెక్టులకు రాయితీ ప్రకటిస్తామన్నారు.

ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్
ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులకు రాయితీలు అందిస్తాం- మంత్రి కందుల దుర్గేష్

AP Tourism : ఏపీలో పర్యాటక, సినీ రంగంలో పెట్టుబడులకు విస్తారమైన అవకాశాలు ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామని ప్రతి పారిశ్రామికవేత్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో రెండు రోజులుగా జరుగుతున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(APTA) కేటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ లో ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని రాష్ట్ర నూతన టూరిజం పాలసీ 2024-29 వివరాలను వెల్లడించారు. ఏపీలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం, రాయితీలు అందిస్తుందని వెల్లడించారు.

yearly horoscope entry point

'ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి.. ప్రభుత్వంతో కలిసి ఆలోచనలు పంచుకోండి'.. సరైన ప్రతిపాదనలతో వస్తే స్పందించి అవకాశం కల్పిస్తామని మంత్రి తెలిపారు. త్వరితగతిన డీపీఆర్ లు ఇస్తే, ఆచరణలో పెడదామని పారిశ్రామికవేత్తలకు మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఏపీలో పర్యాటక, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను వివరించారు. అంతేగాక ఏపీలో నూతన టూరిజం పాలసీ 2024-29 విధి విధానాలు, నూతన ఆవిష్కరణలను పారిశ్రామికవేత్తలకు స్పష్టంగా మంత్రి దుర్గేష్ వివరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిందని, గడిచిన ఆరు నెలల్లో వివిధ రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పర్యాటక రంగ అభివృద్ధికి గొప్ప ప్రయత్నం చేస్తుందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ... గతేడాది సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగానికి సీఎం చంద్రబాబు పరిశ్రమ హోదా కల్పించారని, ఇది పర్యాటక రంగ వృద్ధికి శుభ పరిణామం అన్నారు. దీంతో పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలు పర్యాటక రంగంలో అమలు చేస్తూ అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే సంబంధిత జీవోను విడుదల చేశామన్నారు. ఏపీ ఆర్థిక పురోభివృద్ధి సాధించేలా, ఉపాధి అవకాశాలు కల్పించేలా, సాంస్కృతిక వైభవాన్ని కొనసాగించేలా పాలసీ రూపొందించామని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా టూరిజం సెక్టార్ కు ఇండస్ట్రీ స్టేటస్ కల్పించామని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే విజయవాడలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించామని, ద్వారా పారిశ్రామికవేత్తలు అనుభవాలను, ప్రభుత్వ విధివిధానాలను పంచుకున్నామన్నారు.

రాష్ట్రంలో ఒకే తరహా పర్యాటక అభివృద్ధి కాకుండా అడ్వెంచర్, ఎకో, విలేజ్, వెల్ నెస్ , అగ్రి, బీచ్, హెరిటేజ్, టెంపుల్ తో పాటు క్రూయిస్, కల్చరల్ టూరిజం తరహా పర్యాటక విధానాలు నెలకొల్పాలని భావిస్తున్నామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక ప్రాంతంలో పర్యాటకుడు ఐదు రోజులు ఉండే విధంగా టూరిజం సర్క్యూట్ ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. టూరిజంలో సుస్థిరమైన అభివృద్ధిని సాధించాలన్నది ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటకులకు వసతి సామర్థ్యం పెంచే ప్రక్రియలో భాగంగా 50,000 హోటళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. విశాఖపట్టణం, తిరుపతి, అరకు వ్యాలీ, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట ప్రాంతాల్లో యాంకర్ హబ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

25కు పైగా థీమాటిక్ సర్క్యూట్ లు.. అందులో 2 బుద్దిస్ట్ సర్క్యూట్ లు, 10 టెంపుల్ సర్క్యూట్ లు, 5 బీచ్ సర్క్యూట్ లు, 4 రివర్ క్రూయిజ్ సర్క్యూట్ లు, 3 ఎకో టూరిజం సర్క్యూట్ లు, 2 సీ క్రూయిజ్ సర్క్యూట్ లు, సీప్లేన్ సర్క్యూట్ లు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 40 బౌద్ధ స్మారక చిహ్నాలు, చారిత్రక మహాయాన బౌద్ధ మతం జన్మస్థలంగా ప్రాముఖ్యత, గొప్ప బౌద్ద వారసత్వం, చారిత్రక, పురావస్తు అభివృద్ధి చేసేందుకు చర్యలు.. అందులో భాగంగా విశాఖపట్టణం, శాలిహుండం, తొట్ల కొండ, బొజ్జన కొండ, అమరావతి స్థూపం, ఉండవల్లి గుహలు, నాగార్జున కొండ తదితర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు..

రాష్ట్రంలో విశాలమైన 974 కి.మీల సముద్రతీర ప్రాంతం, అద్భుతమైన ప్రకృతి సౌందర్య దృశ్యాలు ఉన్నాయని ప్రత్యేకించి కోనసీమ, మారేడుమిల్లి లాంటి ప్రకృతి దృశ్య కావ్యాలున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రసాద్, స్వదేశీ దర్శన్-2, శాస్కి పథకాల ద్వారా పర్యాటక అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.స్వదేశీ దర్శన్ ద్వారా అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నది ప్రాంతాల్లో విహారయాత్రలకు అనుకూలమైన వాతావరణం సృష్టించడం, పర్యాటకులను ఆకర్షించేలా రివర్ క్రూయిజ్ సర్క్యూట్ ల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు.

అదేవిధంగా సినిమా రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఏపీలో స్టూడియోలు, డబ్బింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్ లు తదితర మౌలిక వసతుల కల్పనకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. గడిచిన 5 ఏళ్లలో ఏపీలో సరైన ప్రమోషన్లు లేక ప్రజల భాగస్వామ్యం లేక పర్యాటక అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత ప్రభుత్వంలో లోపభూయిష్ట విధానాలు, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడంతో రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి జరగలేదని మంత్రి దుర్గేష్ వివరించారు. దేశంలోనే ఏపీని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Whats_app_banner

సంబంధిత కథనం