గ్రామ వార్డు సచివాలయాలను, సిబ్బందిని తొలగించం.. ఆందోళన చెందవద్దన్న మంత్రి డోలా బాల-minister dola bala says ward secretariat staff will not be reduced ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గ్రామ వార్డు సచివాలయాలను, సిబ్బందిని తొలగించం.. ఆందోళన చెందవద్దన్న మంత్రి డోలా బాల

గ్రామ వార్డు సచివాలయాలను, సిబ్బందిని తొలగించం.. ఆందోళన చెందవద్దన్న మంత్రి డోలా బాల

Sarath Chandra.B HT Telugu

ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కసరత్తు చేస్తున్నట్టు వివరించారు.

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులెవ్వరనీ తొలగించం, అపోహలు నమ్మొద్దు- మంత్రి డోలా

ఏపీలో సచివాలయాలను క్రమబద్దీకరించాలనే ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో జరుగుతున్న ప్రచారాలపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వివరణ ఇచ్చారు. సచివాలయాలను ఏబీసీ క్యాటగిరీలుగా విభజించి సిబ్బంది సర్దుబాటుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు.

సచివాలయాల్లో సిబ్బందిని సర్దుబాటు చేశాకే సచివాలయాల సిబ్బంది బదిలీలు చేపడతామని స్పష్టత ఇచ్చారు. సచివాయాల పనితీరు నిరంతరం పర్యవేక్షణకు మూడు అంచెల విధానం అనుసరిస్తామన్నారు.

రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులెవరినీ తొలగించమని వాటి సంఖ్యను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గ్రామ,వార్డు సచివాలయాలు,సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు.

గ్రామ వార్డు సచివాలయాల రేషన లైజేషన్ కు ఇటీవల ప్రభుత్వం జిఓ జారీ చేసిందని సచివాలయాల ద్వారా రియల్ టైంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా వాటిని తీర్చిదిద్దుతామన్నారు.

ఇందుకు సచివాలయాలను ఎబిసి మూడు కేటగిరీలుగా విభజించామని ఆ ప్రకారం సిబ్బందిని సర్దుబాటు చేస్తామన్నారు. 2500 జనాభా గల గ్రామ సచివాలయంలో 6గురు సిబ్బంది,2500-3000 జనాభా గల సచివాలయాల్లో 7రు,3వేలకు పైన జనాభా గల సచివాలయాల్లో 8మంది సిబ్బంది ఉండేలా విభజించామని తెలిపారు.

సచివాలయాలకు క్లస్టర్ విధానాన్ని అనుసరిస్తామని అందుకు అనుణంగా సిబ్బందిని సర్దుబాటు చేశాక వారి బదీలను చేస్తామని చెప్పారు. ప్రస్తుత సాధారణ బదిలీల సమయంలో సచివాలయాల సిబ్బంది బదిలీల ప్రక్రియను చేపట్టడం లేదని వివరించారు.

ప్రస్తుతం కొన్ని సచివాలయాల్లో 10 మంది వరకూ సిబ్బంది ఉండగా కొన్నిచోట్ల ముగ్గురు నలుగురు సిబ్బందితో కూడా నడుస్తున్నాయని చెప్పారు.దానివల్ల కొన్ని చోట్ల ఎక్కువ పని ఒత్తిడి కొన్ని చోట్ల తగిన పనిలేని పరిస్థితులు ఉన్నాయని అలాంటి సమస్యలన్నిటినీ పరిష్కరించి సిబ్బంది అందరికీ పూర్తి స్థాయిలో పని కల్పించి తద్వారా ప్రజలకు రియల్ టైంలో మరిన్ని సేవలు సకాలంలో అందే విధంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

త్వరలో మూడు అంచెల విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్టు మంత్రి వీరాంజనేయస్వామి వెల్లడించారు. జిల్లా,మండల,అసెంబ్లీ నియోజకర్గ స్థాయిలో ప్లానింగ్ బోర్డులు ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో జిల్లా అధికారి,మండల స్థాయిలో ఎంపిడిఓ, నియోజకవర్గ స్థాయిలో ఒక అధికారికి కొంతమంది సిబ్బిందిని ఇచ్చి వారి ద్వారా గ్రామ వార్డు సచివాలయాల పనితీరును నిరంతరం పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం