Ambati On CBN: చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమన్న మంత్రి అంబటి రాంబాబు
Ambati On CBN: చంద్రబాబు అరెస్ట్, జైలుకు వెళ్లడం దురదృష్టకరం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు వంటి కుంభకోణాల్లో సైతం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఇన్నాళ్లు వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకున్నారని ఇకపై అవి కుదరదన్నారు.
Ambati On CBN: వ్యవస్థల్ని మేనేజ్ చేసి బయట పడటం చంద్రబాబుకు అలవాటని అన్ని రోజులు చంద్రబాబువి కాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. న్యాయస్థానంలో సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయని భావించి పారదర్శకంగా చంద్రబాబుకు రిమాండ్ విధించిందని చెప్పారు.
చట్ట ప్రకారమే చంద్రబాబును జైలుకు పంపారని అంబటి రాంబాబు చెప్పారు. బాబు అరెస్ట్ దురదృష్టకరమైన సంఘటన అని, రాజకీయ నాయకుడు అరెస్టై జైలుకు వెళ్లడం దురదృష్టకరమని, అయితే చంద్రబాబు రాజకీయ జీవితం ఎలాంటిదో ప్రజలు గుర్తించాలన్నారు.
చంద్రబాబు మీద కక్ష పూరితంగా జైలుకు తీసుకెళ్లారని విస్తృత ప్రచారం చేస్తున్నారనిని అంబటి ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో అన్యాయంగా, ఆధారాలు లేకుండా కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకోవని చెప్పారు. కోర్టు ఉత్తర్వులపై సానుభూతి పొందేందుకు బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపి ఆనందపడాల్సిన అవసరం తమకు లేదన్నారు.
ఇన్నాళ్లు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు…
చంద్రబాబు జీవితం మొత్తం ఎలా ప్రవర్తించారో, అవినీతి చేశారో, మోసాలు చేశారో అందరికి తెలుసన్నారు. సమర్ధవంతంగా సంస్థల్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి పక్కకు తప్పుకు పోగలిగారని అన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోను ఎక్కకుండా సమర్ధవంతమైన వ్యవస్థలు ఆయన చేతిలో ఇన్నాళ్లు ఉన్నాయన్నారు. ఆయన దురదృష్టం, ప్రజల అదృష్ట వశాత్తూ ఆ మేనేజ్‌మెంట్ చేసే వ్యవస్థలు ఇప్పుడు అందుబాటులో లేవన్నారు. బాబు అరెస్టైన దగ్గర నుంచి చాలా కుట్రలకు తెర లేపరన్నారు.
9వ తేదీ ఉదయం బాబును నంద్యాలలో అరెస్ట్ చేశారని, విఐపి, సీనియర్ నాయకుడు, వయసులో పెద్ద వ్యక్తి కావడంతో రోడ్డు మార్గంలో కాకుండా, హెలికాఫ్టర్ వెళ్దామని సిఐడి కోరితే రోడ్డు మార్గంలో వెళ్లాలని ఆయనే సూచించారన్నారు.
రోడ్డు మార్గంలో వస్తే జనం తండోపతండాలుగా వస్తే జనం భారీగా వచ్చి అడ్డు పడతారని అనుకున్నారని, అచ్చం నాయుడు, లోకేష్‌లు అందరికి ఫోన్లు చేసి జనాలను రోడ్ల మీదకు రావాలని పిలుపునిచ్చినా ఎవరు పెద్దగా రాలేదన్నారు. చంద్రబాబు అవినీతి పరుడని అందరికి తెలిసినా, బాబును పట్టుకునే అవకాశం ఇన్నాళ్లు రాలేదన్నారు.
హెలికాఫ్టర్‌లో ఎందుకు రాలేదు…
హెలికాఫ్టర్ లో రాకుండా రోడ్డు మార్గంలో వచ్చిన చంద్రబాబుకు నిరాశ తప్ప ఏమి దక్కలేదన్నారు. చంద్రబాబు విజయవాడ వచ్చేసరికి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో న్యాయవాదులు తరలి వచ్చారని అంబటి చెప్పారు. 30-40మంది న్యాయవాదులు విజయవాడలో ఉన్న చిన్న కోర్టుకు వచ్చి వాదనలు వినిపించారని, వారంతా చంద్రబాబు తప్పు చేయలేదని, కుంభకోణం జరగలేదని వాదించలేదని, కేవలం కుంభకోణానికి చంద్రబాబుకు సంబంధం లేదని మాత్రమే వాదించారని చెప్పారు.
బాబును 24గంటల్లో కోర్టులో హాజరు పరచలేదని, ప్రివెన్షన్ కేసులో నోటీసులు ఇవ్వలేదని, నంద్యాల కోర్టులో హాజరు పరచలేదని పస లేని వాదనలు వినిపించారన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్లతో పాటు చంద్రబాబు స్వయంగా వాదనలు వినిపించారని, టెక్నికల్ ఇష్యూలు ఉన్నాయి కాబట్టి తనను వదిలేయాలని చెప్పారన్నారు. తాను ఏ తప్పు చేయలేదని బాబు చెప్పలేదన్నారు.
బలమైన ఆధారాలు ఉండటం, కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత చంద్రబాబును జైలుకు పంపినట్లు న్యాయమూర్తి నిర్ణయించారని చెప్పారు. అదేమి కక్ష సాధింపు కాదని, కక్ష కట్టి లోపల వేశారని చౌకబారు ప్రచారం చేశారన్నారు. చంద్రబాబు నేరాలు చేయడం కొత్త కాదని, చేసిన నేరాలను గుర్తించడం కొత్తగా జరిగిందన్నారు.
బాబు చరిత్ర మొత్తం అదే…
గతంలో కూడా బాబు అనేక కుంభకోణాలు చంద్రబాబు చేశాడని, డబ్బుంటే దేన్నైనా కొనవచ్చని చంద్రబాబు భావిస్తారని, డబ్బుతో మాత్రమే అధికారంలోకి వచ్చాడన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్సీని కొనాలని రేవంత్ రెడ్డి ద్వారా కట్టలు కట్టలు నగదు ఇచ్చిన దృశ్యాలు వీడియోల్లో దొరికాయని, ఏం పర్లేదు అన్ని చూసుకుంటామని చెప్పారని, వీడియోలు, ఆడియోలు వచ్చినా చంద్రబాబు తప్పుకున్నారని, డబ్బుంటే దేన్నైనా కొనొచ్చని నిరూపించారన్నారు.
ఏపీలో ఎన్నికలు ఖరీదు కావడానికి నారా చంద్రబాబు నాయుడే కారణమన్నారు. స్కాముల్లో సంపాదించి వాటిని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడం బాబుకు అలవాటని ఆరోపించారు. రాష్ట్రాన్ని అవినీతి మాయం చేసి అధికారంలోకి రావడం బాబుకు అలవాటేనన్నారు. చంద్రబాబు నిప్పు, గొప్పోడు, జగన్ దుర్మార్గుడని మీడియాలో ప్రచారం చేసి చంద్రబాబు దేవుడని నమ్మించే ప్రయత్నాలు ప్రజలు నమ్మడం లేదన్నారు.
ఆ రోజు ఎందుకు చేయలేదన్న అంబటి…
9,10 తేదీల్లో ఎందుకు బంద్ చేయలేదని అంబటి ప్రశ్నించారు. కోర్టు తీర్పు మీద ఆందోళన చేయడం ఏమిటని ప్రశ్నించారు. తిక్కలోడు తిరునాళ్లకు వెళితే ఎక్కాదిగా సరిపోయినట్టు పవన్ పరిస్థితి తయారైందని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మద్దతు ఎందుకిస్తున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీ నిజమేనా అని నిలదీశారు.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకుని అరుస్తున్న పవన్ కళ్యాణ్, ముద్రగడ దీక్ష చేస్తున్న సమయంలో కొట్టి బయటకు లాక్కొస్తే ఏమయ్యాడని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని అక్రమాలు చేసినా వాటిని సమర్ధిస్తూ, చంద్రబాబు మీద ఈగ వాలనివ్వకుండా చూస్తున్నారని ప్రశ్నించారు. పవన్ తన పార్టీని బతికించుకోకుండా చంద్రబాబు పార్టీని బతికించాలని చూడటం దేని కోసం అని ప్రశ్నించారు.