Ganta On Minister Adimulapu : గూగుల్‌కు కంటెంట్ అందించేదీ ఓ గురువే, మంత్రి సురేష్ కు గంటా కౌంటర్
Ganta On Minister Adimulapu : గురువుల కన్నా గూగుల్ మిన్న అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు.
Ganta On Minister Adimulapu : గురువుల కన్నా గూగుల్ లో ఎక్కువ మెటీరియల్ లభిస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను అగౌరవ పరుస్తూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. బైజూస్ తో టెక్నాలజీ మొత్తం ట్యాబుల్లో అందుబాటులోకి వచ్చిందన్నారు. గురువుల స్థానంలో ఇప్పుడు గూగుల్ వచ్చిందంటూ మాట్లాడారు. ఉపాధ్యాయులకు తెలియని అంశాలు కూడా గూగుల్‌లో ఉంటున్నాయన్నారు. గూగుల్ వచ్చిన తర్వాత గురువులు అవసరం లేని పరిస్థితి వచ్చిందని మంత్రి సురేష్ మాట్లాడడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజు రోజుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని, దానిని విద్యార్థులు చెప్పడానికి గురువు కావాలని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు సాంకేతికతను అందుబాటులోకి తెస్తోందన్నారు. అందులో భాగంగా ట్యాబ్ లు అందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు తెలిపారు. బైజూస్ తో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు అధునాతన విద్య అందిస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీ విద్యార్థులకు వైసీపీ సర్కార్ ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు అన్నారు.
మాజీ మంత్రి గంటా కౌంటర్
గురువుల కన్నా గూగుల్ మిన్న అని మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రిపై విమర్శలు చేశారు. గూగుల్ మిన్న, గురువులు సున్నా.. ఇదేం సన్మానం మంత్రి గారు అంటూ ప్రశ్నించారు. గురుపూజోత్సవం నాడు గురువును పూచికపుల్లతో సమానంగా తీసిపడేశారని మండిపడ్డారు. ఈ ప్రపంచంలో ఉపాధ్యాయులకు ఏది ప్రత్యామ్నాయం కాదన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. గూగుల్‌కు కంటెంట్ అందించేదీ ఓ గురువే అనే సంగతి గమనించాలన్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా కూడా గూగుల్ చదువులు లేవన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో గురువులే చదువులు చెబుతున్నారన్నారు.
మంత్రి క్షమాపణలు చెప్పాలి
గూగుల్ కంటెంట్ మాత్రమే ఇస్తుందన్న గంటా... విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించి, వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేది గురువులే అన్నారు. గురువల పాత్ర ఎంతో కీలకమైందన్న ఆయన... గూగుల్ సీఈఓ సుందర్ పిచై కూడా తన గురువుల నుంచే జ్ఞానాన్ని సంపాదించారన్నారు. రేపటి సమాజం ఎలా ఉంటుందో నేడు గురువులను బట్టే ఉంటుందన్నారు. అలాంటి గురువును మంత్రి ఆదిమూలపు గురుపూజోత్సవం సభలో అగౌరవ పరుస్తూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.