AP Rice Prices Hike: బియ్యమో జగన్మోహనా! ధరలకు రెక్కలతో మధ్య తరగతి విలవిల.. పట్టించుకోని ప్రభుత్వం-middle class with wings on rice prices ap govt not paying attention ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Rice Prices Hike: బియ్యమో జగన్మోహనా! ధరలకు రెక్కలతో మధ్య తరగతి విలవిల.. పట్టించుకోని ప్రభుత్వం

AP Rice Prices Hike: బియ్యమో జగన్మోహనా! ధరలకు రెక్కలతో మధ్య తరగతి విలవిల.. పట్టించుకోని ప్రభుత్వం

Sarath chandra.B HT Telugu
Mar 04, 2024 08:54 AM IST

AP Rice Prices Hike: ఏపీలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చినా వాటిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తోంది.

తరచూ బియ్యం ధరల పెరుగుదలతో సామాన్యుల విలవిల
తరచూ బియ్యం ధరల పెరుగుదలతో సామాన్యుల విలవిల

AP Rice Prices Hike: ఏపీలో బియ్యం ధరలకు రెక్కలు వచ్చినా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. నిత్యావసర వస్తువుల ధరల్లో రోజువారీ మార్పులతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. వేతన జీవులు, మధ్య తరగతి ప్రజలపై భారం అధికం అవుతున్నా ప్రభుత్వం ధరల నియంత్రణ విషయంలో చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తోంది. ఆహార పదార్ధాల ధరల్లో పదేళ్ల గరిష్ట స్థాయికి ధరలు పెరిగినా నియంత్రణ విషయంలో కనీస చర్యలు తీసుకోవడంలో వెనుకాడుతున్నారు.

ఏపీలో గత ఏడాది ఖరీఫ్‌ సీజన్ పంట చేతికొచ్చే సమయానికి మిచాంగ్  తుఫాను Michaung Cyclone ధాన్యం ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీసింది. దీంతో మిల్లర్లు కుమ్మక్కై గిడ్డంగుల్లో సరిపడా నిల్వలు ఉన్నా కృత్రిమ కొరత ప్రారంభించారు. ఇది ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి తెలిసే జరుగుతున్నా ధరల నియంత్రణ విషయంలో తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ధరల పెరుగుదదలకు వ్యాపారులు నెపం మిల్లర్ల మీదకు నెడితే మిల్లర్లు తమకు పై నుంచి వచ్చిన ఆదేశాలతో ధరలు పెంచుతున్నట్లు చెబుతున్నారు. ఈ ధరలు ఎందుకు పెరిగాయనే దానిపై సహేతుక కారణాలు మాత్రం కనిపించవు.

బియ్యం ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. రిటైల్ మార్కెట్‌లో నాణ్యమైన బియ్యం ధరలు కిలో రూ.70కు చేరువలో ఉన్నాయి. ప్రభుత్వం వీటి ధరలను నియంత్రించకపోవటంతో సామాన్యులు పెరిగిన ధరలతో అల్లాడుతున్నారు. ఏడాది కాలంలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలోకు ధర నాణ్యత బట్టి కిలో రూ.15-20 వరకూ పెరిగింది.

గత ఏడాది వచ్చిన మిచౌంగ్‌ తుపాను వల్ల పంట Paddy దిగుబడి తగ్గిందని, ధాన్యం సరఫరా లేదని అందువల్ల ధరలు పెరిగాయని చెబుతూ మిల్లర్లు, వ్యాపారులు జనం నడ్డి విరిచేస్తున్నారు.

గతేడాది సోనా మసూరి కిలో రూ.44-50 మధ్య ఉంటే ఇప్పుడు కనీస ధర రూ.60గా వసూలు చేస్తున్నారు. బిపిటి రూ.40లు ఉంటే ఇప్పుడు రూ.56లు ఉంది. హెచ్‌ఎంటి స్ట్రీమ్‌ రూ.44ల నుండి రూ.61లకు, బిపిటి స్ట్రీమ్‌ రూ.38 నుండి రూ.50లకు పెరిగింది. హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే ధరలు ఈ విధంగా ఉంటే రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధరలు మరింత పెంచేశారు. కిలోరూ.70కుపైగా వసూలు చేస్తున్నారు.

ఐదేళ్లలో అతి తక్కువ ఉత్పత్తి…

ఏపీలో ఈ ఏడాది వ్యవసాయ శాఖ ముందస్తు అంచనాల్లో ఐదేళ్లలో అతి తక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉంటుందని పేర్కొన్నారు. వరి ఉత్పత్తి కూడా కనిష్టంగా ఉంటుందని లెక్కించారు. . 2023-24లో ఖరీఫ్‌, రబీ కలుపుకొని 85 లక్షల ఎకరాల్లో ఆహార పంటలు సాగవుతాయని, 154 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని మొదట అంచనా వేశారు.

గత ఐదేళ్లల్లో ఆహార ధాన్యాల సాగు, ఉత్పత్తి ఇదే కనిష్టం. రాష్ట్రంలో ఆహార పంటల్లో ప్రధానమైన వరి పంట దిగుబడి తగ్గిపోయింది. ఈ ఏడాది రెండు సీజన్లూ కలుపుకొని 49.25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, 118.40 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం న రెండవ ముందస్తు అంచనాల్లో తెలిపింది.

కరువు పరిస్థితులు, అకాల భారీ వర్షాలు, మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో అతి తక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి వస్తోంది. ఈ ప్రభావం మార్కెట్లలో దారుణంగా ఉంటోంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. బియ్యం ఉత్పత్తి తగ్గితే ధరలు మరింత పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టకపోవడమే సమస్యగా అసలు కారణంగా కనిపిస్తోంది.

కరుణించని ప్రకృతి….

2023 ఖరీఫ్‌ను వర్షాభావం వెంటాడింది. కరువు మండలాల ప్రకటనలో ప్రభుత్వం అనావృష్టి తీవ్రతను తక్కువ చేసి చూపించింది. తుపాన్‌ నష్టం అంచనాల్లోనూ అలాగే వ్యవహరిం చింది. కానీ పంటల సాగు, దిగుబ డుల దగ్గర దాచలేకపో యింది. రబీలో ఫిబ్రవరి 7 నాటికి ఆహార ధాన్యాల సాగు ఏమంత అశాజ నకంగా లేదు. ఆహార ధాన్యాలు సాధారణ సాగులో 67 శాతమే సాగయ్యాయి. వరి 65 శాతమే సాగైంది. ప్రభుత్వం వేసిన ముందస్తు అంచనాల మేరకు కూడా పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించట్లేదు.

అర్థగణాంక శాఖ వ్యవసాయ దిగుబడులపై రూపొందించే రెండవ ముందస్తు అంచనాలు డిసెంబర్‌, జనవరిలో వస్తాయి. ఖరీఫ్‌ అంచనాలు కాస్త దగ్గరగా ఉన్నా రబీ అంచనాలు ఎప్పుడూ పక్కాగా ఉండవు. 2021-22లో ఆహారధాన్యాల దిగుబడులు 169 లక్షల టన్నులొస్తాయని రెండవ అంచనాల్లో పేర్కొనగా తుదకు 154 లక్షల టన్నులే లభించాయి. వరి విషయానికే వస్తే 2021-22లో 135 లక్షల టన్నులొస్తాయనుకుంటే ఫైనల్‌గా 121 లక్షల టన్నులొచ్చాయి. 2022-23లో 133 లక్షల టన్నులొస్తాయని అంచనా వేయగా 126 లక్షల టన్నులు లభించాయి. ఈ సారి మరింత తగ్గుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది.

కనిపించని భారత్ బ్రాండ్….

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆహార ఉత్పత్తుల ధరల నియంత్రణ కోసం ప్రవేశ పెట్టిన భారత్ బ్రాండ్‌ ప్రచారంలో తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు. తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందిస్తామని ప్రకటించినా ఏపీలో వాటి విక్రయాలు పెద్దగా కనిపించడం లేదు.

పట్టణాలు, పల్లెల్లో భారత్ బ్రాండ్‌ బియ్యాన్ని అందుబాటులోకి తెస్తే ప్రజలకు భారం తగ్గే వీలున్నా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదు. రాష్ట్రంలో దాదాపు 87శాతానికి పైగా కోటిన్నర కుటుంబాలకు రైస్‌ కార్డుల ద్వారా ప్రభుత్వం బియ్యం అందిస్తున్నట్టు లెక్కలు చెబుతోంది. ఈ బియ్యం కొనుగోలు నుంచి ప్రజలకు చేరేందుకు కిలోకు దాదాపు రూ.40 ఖర్చు చేస్తోంది.

రైతుల నుంచి నేరుగా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసినా ధర దాదాపుగా అంతే అవుతుంది. దళారులు, మిల్లర్ల జోక్యంతోనే బియ్యం ధరల పెరుగుదలకు అసలు సమస్యగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గత మూడు నెలలుగా ధరల పెరుగుతున్నా సంబంధిత శాఖల మంత్రులు ఒక్కసారి కూడా స్పందించకపోవడం విచిత్రం

Whats_app_banner