డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవికి ఆరోగ్యం బాగాలేనట్టుగా తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఆమె హెల్త్ సరిగా లేదని తెలియడంతో వెంటనే బయల్దేరారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరుగుతోంది. దీనికి పవన్ కల్యాణ్ సైతం హాజరయ్యారు. తల్లికి బాలేదని తెలియడంతో మీటింగ్ మధ్యలో నుంచి వచ్చేశారు. అయితే ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి అధికారిక సమాచారం ఇంకా బయటకు రాలేదు. ఇప్పటికే మిగిలిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోనే ఉన్నారు.
అంజనా దేవి తీవ్ర అస్వస్థతకు గురవ్వగానే కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే గతంలో కూడా అంజనా దేవి ఆరోగ్య పరిస్థితిపై వార్తలు వచ్చాయి. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారని కథనాలు వెలువడ్డాయి. విజయవాడ పర్యటనలోని పవన్, దుబాయ్ పర్యటనలో ఉన్న చిరంజీవి బయలుదేరారు అంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై అప్పుడు మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తన తల్లి ఆరోగ్యంపై ఊహజనిత కథనలు ప్రచురించవద్దని కోరారు.
ఇక ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. విశాఖలో ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమి ఎకరా తొంభైతొమ్మిది పైసలకే కేటాయించే ప్రతిపాదనను ఆమోదించనుంది. ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా రూ.1582 కోట్ల పెట్టుబడి పెట్టనుంది కాగ్నిజెంట్.
మరోవైపు రాజధాని అమరావతిలో పరిపాలన భవన నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు సైతం ఆమోదం తెలపనుంది. రూ.882.47 కోట్లతో జీఏడీ టవర్, రూ.1487 కోట్లతో హెచ్‌ఓడీ కార్యాలయాలు, రూ.1303 కోట్లతో ఇతర పరిపాలన భవనాల నిర్మాణానికి కొన్ని సంస్థలు టెండర్లు దక్కించుకున్నాయి.