AP Mega DSC Update: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫషికేషన్‌, లోకేష్‌ నోట తీపికబురు, అభ్యర్థుల ఎదురు చూపులు-mega dsc notification coming soon lokeshs note sweet kaburu waiting for candidates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Mega Dsc Update: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫషికేషన్‌, లోకేష్‌ నోట తీపికబురు, అభ్యర్థుల ఎదురు చూపులు

AP Mega DSC Update: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫషికేషన్‌, లోకేష్‌ నోట తీపికబురు, అభ్యర్థుల ఎదురు చూపులు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 12, 2024 06:47 AM IST

AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి నారా లోకేష్‌ తీపి కబురు అందించారు. త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటన వెలువరిస్తామని ప్రకటించారు. నవంబర్ మొదటి వారంలోనే డిఎస్సీ ప్రకటన వెలువరించాల్సి ఉండగా రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో నోటిఫికేషన్‌ విడుదలలో జాప్యం జరుగుతోంది.

జాతీయవిద్యా దినోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్
జాతీయవిద్యా దినోత్సవంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్

AP Mega DSC Update: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియమాక నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్‌ తీపికబురు చెప్పారు. నవంబర్‌ 3వ తేదీన విడుదల కావాల్సిన మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ మంత్రి విదేశీ పర్యటనలో ఉండటంతో వాయిదా పడింది. ఆ తర్వాత 6వ తేదీన వెలువడుతుందని ప్రకటించారు. ఆ తర్వాత అనూహ్య కారణాలతో డిఎస్సీ ప్రకటన బయటకు రాలేదు. రిజర్వేషన్ల అంశం వివాదాస్పదంగా మారడంతో డిఎస్సీ ప్రకటన ఆగిపోయినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌ త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.

త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తున్నట్టు లోకేష్‌ జాతీయ విద్యా దినోత్సవంలో ప్రకటించారు. క్లాస్ కో టీచర్ ఖచ్చితంగా ఉండాలనే తన లక్ష్యమని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్ఠిక ఆహారం అందిస్తున్నామని, జోన్ల వారీగా పిల్లలకు నచ్చే భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. క్వాలిటీ విషయంలో రాజీ ఉండదని ఎక్కడైనా తప్పు జరిగితే చర్యలు తప్పవన్నారు.

చదువుతో పాటు పిల్లలకు ఆటలు, సైన్స్ కాంపిటీషన్లు పెట్టబోతున్నాం. నాడు- నేడు అని పబ్లిసిటీ చేసారు అసలు కొన్ని స్కూల్స్ లో కూర్చోడానికి బల్లలే లేవు. అందుకే రాబోయే 3 ఏళ్లలో అన్ని స్కూల్స్ లో కనీస సదుపాయాలైన లీక్ ప్రూఫ్ భవనాలు, తాగునీరు, టాయ్ లెట్స్, కంప్యూటర్ ల్యాబ్స్ వంటివి కల్పించాలని ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. ఉపాధ్యాయులు తలుచుకుంటే మనం ప్రైవేట్ స్కూల్స్ కి గట్టి పోటీ ఇవ్వగలరన్న నమ్మకం నాకుంది. అందరం కలిసి ప్రభుత్వ విద్యా వ్యవస్థ కు పూర్వ వైభవం తీసుకొద్దామన్నారు.

విద్యార్థులను జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ క్రియేటర్స్ గా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఈ పోటీ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసే సూపర్ కిడ్స్ ను తయారు చేద్దామని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసింది, రాత్రి ఆత్మలతో మాట్లాడటం, ఉదయాన్నే అడ్డగోలు నిర్ణయాలు అమలు చేశారని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. జిఓ.117 తీసుకొచ్చి స్కూల్స్ మూసేసారని, ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదని, వెయ్యి స్కూల్స్ లో సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని మేము వచ్చిన తరువాత టెస్ట్ పెడితే 90 శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యారని వాళ్ళ భవిష్యత్తు తో గత ప్రభుత్వం ఆటలాడిందన్నారు. టోఫెల్, ఐబీ కూడా అలాంటి నిర్ణయాలే కనీస అవగాహన లేకుండా ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నిర్ణయాలు అమలు చేశారన్నారు.

విద్యావ్యవస్థలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేం

విద్యా వ్యవస్థలో ఇతర శాఖల్లో తీసుకున్నట్టు నిర్ణయాలు తీసుకోలేం. మనం తీసుకునే నిర్ణయం కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉంటుంది. అందుకే నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో చర్చించి అది మనం అమలు చేయగలమా లేదా ? విద్యార్థులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకొని నిర్ణయాలు తీసుకుంటున్నాం.

గత ప్రభుత్వంలో పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ. ఫీజు రీఎంబర్స్ మెంట్, వివిధ బిల్లులకు సంబంధించి రూ. 6,500 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టి పోయారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలపై సమీక్ష చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యా వ్యవస్థను గాడిన పెడతామన్నారు.

విద్యాశాఖ తీసుకోవద్దని సలహా ఇచ్చారు

తాను విద్యా శాఖ తీసుకుంటున్నా అని తెలియగానే ఎంతో మంది అది కష్టమైన శాఖ, అనేక సమస్యలు ఉన్నాయి, మీరు తీసుకోవద్దని సలహా ఇచ్చారు. స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చేసిన నేను కాకపోతే ఇంకెవరు తీసుకుంటారు అని ఛాలెంజ్ గా తీసుకున్నాను. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చెయ్యడమే నా ఎజెండా. కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను.

డిల్లీ మోడల్, కేరళ మోడల్ కాదు ఐదేళ్ల లో అందరూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకునే విధంగా చేస్తానన్నారు. విలువలతో కూడిన విద్య అవసరం. మార్కులు, ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యమైనది విలువలు. మహిళల్ని గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, తల్లితండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం లాంటివి విద్యలో భాగం కావాలి. సమాజానికి ఉత్తమ పౌరులను అందించే విధంగా మన విద్యా వ్యవస్థ ఉండాలి. ఉత్తమ పౌరులను తయారుచేసే శక్తి ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది.

ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం.నా బలం, బలగం అయిన ఉపాధ్యాయుల వలనే ఇది సాధ్యం అవుతుంది. అవుట్ కం బేస్డ్ విద్య కోసం ఉపాద్యాయులు కృషి చేయాలి. రాష్ర్టంలో విద్యావ్యవస్థను రాబోయే రోజుల్లో నెం.1 చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. రాబోయే.రోజుల్లో ఉన్నతవిద్యలో ఎన్ఐ ఆర్ ఎఫ్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రానికి 3 వ స్థానం సాధిస్తాం. అదేవిధంగా ప్రపంచంలో టాప్ 100 వర్సిటీల్లో ఏపీ వర్శిటీ ఉండేలా కృషిచేస్తాం.

విద్యావ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలి

విద్యా వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా ఉండాలని బలంగా నమ్ముతానని గత ప్రభుత్వం లో పేర్లు, రంగులు, ఫోటోల పిచ్చి అందరూ చూశారని నేను మంత్రి అయిన తరువాత ఎక్కడా నా ఫోటో పెట్టొద్దని చెప్పానని లోకేష్‌ వివరించారు. గత ప్రభుత్వం అనేక యాప్ లు తీసుకొచ్చి చదువు చెప్పాల్సిన మీతో బాత్ రూమ్ ఫోటోలు తీయించిందని, పనికిమాలిన యాప్స్ అన్ని తీసేయమని ఆదేశించానన్నారు. మీ మీద భారం తగ్గించేందుకు అధికారులతో చర్చిస్తున్నాను. త్వరలోనే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా నిర్వహించబోతున్నామని చెప్పారు. ఏడాదికి 4 సార్లు మెగా పిటిఎం నిర్వహిస్తామన్నారు.

Whats_app_banner