Tirumala Vaikunta Darsanam: తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. జనవరి 10 నుంచి 19 వరకు పదిరోజుల పాటు దర్శనాలు కల్పిస్తారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తుల తరలి రానుండటంతో టీటీడీ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం దాదాపు 7లక్షల మంది భక్తులు తరలి వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది.
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో సామాన్య భక్తులు ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకునేలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని టిటిడి చైర్మెన్ బీఆర్. నాయుడు తెలిపారు. 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు భక్తులు శ్రీవారి దర్శించుకునేందుకు వీలుగా టిటిడి అధికారులు, మునిసిపల్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి శనివారం రామచంద్ర పుష్కరిణి వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసేందుకు వీలుగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుండి 1.20 లక్షల టోకెన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ఇందుకోసం తిరుపతిలోని 8 కేంద్రాలలో 90 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 94 కౌంటర్లలో టోకెన్లు మంజూరు చేస్తారన్నారు.
జనవరి 13 నుండి 19వ తేదీ వరకు ఏరోజుకారోజు ముందు రోజు టోకెన్లను తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో మాత్రమే టోకెన్లు జారీ చేసేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.