Vja Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం, కాలిబూడిదైన ఎగ్జిబిషన్, లక్షల్లో ఆస్తి నష్టం.. అనుమతులపై అనుమానాలు
Vja Fire Accident: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలోని ప్రైవేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దుకాణాలు కాలి బూడిద అయ్యాయి. భారీగా మంటలు ఎగసి పడటంతో చుట్టు పక్కల ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు.

Vja Fire Accident: విజయవాడ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్‌లో మంటలు చెలరేగి దుకాణాలు కాలి బూడద అయ్యాయి. ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు లేవనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక రాజకీయ నాయకుల అండతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరంలో గత కొన్నేళ్లుగా ప్రైవేట్ స్థలాల్లో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయడం, పోలీసులు, ఫైర్ సిబ్బంది వాటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నగరంలోని కృష్ణా తీరంలో ఉన్న ఖాళీ స్థలంతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాది పొడవున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వీటికి ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండటం లేదు.
ఈ క్రమంలో రెండు వారాల క్రితం ఏర్పాటు చేసిన ప్రదర్శనలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఎగ్జిబిషన్ మొత్తం కాలి బూడిదైంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జిబిషన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెబుతున్నా, ప్రదర్శనకు ప్రజల్ని అనుమతించే సమయంలో జరిగితే ఏమి జరిగి ఉండేదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 15-20 నిమిషాల్లోనే దుకాణాలన్నింటిని మంటలు కమ్మేశాయి. నిత్యం వేల సంఖ్యలో జనం ఎగ్జిబిషన్‌కు తరలి వస్తున్నారు. సందర్శకులు ఎవరు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టైంది.
ఎగ్జిబిషన్ ఆవరణలో ఉన్న దుకాణాల్లో గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దంతో పేలిపోయాయి. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేకపోవడంతో దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి దుకాణాలను తెరుస్తున్నారు. ఈ క్రమంలో వాటిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. నగరంలో ప్రదర్శనల విషయంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వందలాది దుకాణాలు కాలి బూడిద కావడంతో భారీగా నష్టం వాటిల్లింది.
సంబంధిత కథనం