పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండి మండలంలోని ఒక గ్రామంలో తమ కుటుంబ జీవిస్తోంది. తమ ప్రాంతానికే చెందిన యర్రంశెట్టి రవి, సోమేశ్వరరావు ఆ వివాహిత పట్ల అనుచితంగా వ్యవహించారు. ఆమెను బలవంతంగా లోబర్చుకుని, తమకు సహకరించకపోతే భర్తను, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. వారి చెర నుంచి బయటపడేందుకు ఆమె ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. కొడుతూ ఆమెకు బలవంతంగా మత్తు మందు తాగించి.. అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమె మత్తులోకి జారుకున్నతరువాత నగ్నంగా వీడియోలు తీసుకొని, అక్కడే వదిలేసి వెళ్లి పోయారు. ఆ తరువాత వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఆమెను లోబర్చుకున్నారు. వివిధ ప్రాంతాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. పేరుపాలెం సముద్రతీరానికి, భీమవరంలోని ఫ్రెండ్స్ రూములకు తీసుకెళ్లి ఆమెను అనుభవించారు. అంతేకాకుండా వీడియోలు చూపి బెదిరించి విడతల వారీగా ఆమె వద్ద రూ.2.50 లక్షల వరకు డబ్బును తీసుకున్నారు. ఇంకా డబ్బు కావాలని ఆమెను వేధిస్తున్నారు.
నిందితుల వేధింపులను తాళలేక బాధితురాలు కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వారి సహకారంతో మార్చి 1న ఉండి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులపై ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని వేడుకుంది. అయితే పోలీసులు బాధితురాలు చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదు. పైగా నిందితులకు అనుకూలంగా వ్యవహరించారు. రాజీకి రావాలని, లేదంటే కౌంటర్ కేసు పెడతామని బాధితురాలని పోలీసులు బెదిరించారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో బాధితురాలు, వారి కుటుంబ సభ్యులు, రజక జన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కట్లయ్యతో కలిసి సోమవారం ఏలూరు రేంజ్ ఐజీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని, నిందితులను శిక్షించాలని, స్థానిక పోలీసులు పట్టించుకోవటం లేదని ఐజీ అశోక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జరిగిన విషయం మొత్తం ఆయనకు వివరించారు.
దీనిపై ఆయన స్పందిస్తూ.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని విచారణ అధికారిగా నియమించారని, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని.. రజక సంఘం నేత కట్లయ్య వివరించారు. న్యాయం జరిగే వరకు పోరాడుతామని.. పోలీసులు న్యాయం చేయాలని కోరారు. స్థానిక పోలీసులు న్యాయం చేయకపోగా.. నిందితులకు అనుకూలంగా వ్యవహరించడంతోనే పైఅధికారి వద్దకు వచ్చామని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)