మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ - ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత సుధాకర్‌ మృతి-maoist top leader sudhakar killed in encounter ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ - ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత సుధాకర్‌ మృతి

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ - ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత సుధాకర్‌ మృతి

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సింహాచలం అలియాస్‌ సుధాకర్‌ మృతి చెందారు.

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తలిగింది. ఎన్ కౌంటర్ లో పార్టీ అగ్రనేత సుధాకర్‌(అలియాస్ సింహాచలం) మృతి చెందాడు. కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్న సుధాకర్ పై రూ.50 లక్షల రివార్డు ఉంది. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం.

ఉదయం నుంచి కాల్పులు…!

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల క్యాడర్ ఉన్నట్లు నిఘా సమాచారం మేరకు సైనిక దళాల ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టులు, ఉమ్మడి దళాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో సింహాచలం(65) ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.

గత 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో సుధాకర్ ఉన్నారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో ఆయన కూడా పాల్గొన్నారు. కీలక నేతల మృతితో మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

ఇటీవలే కేశవురావు మృతి:

ఇటీవలనే ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపుర్‌ సరిహద్దులో.. మే 21న భారీ ఎన్‌కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బస్వరాజ్‌ అలియాస్‌ బీఆర్‌ దాదా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే అతి పెద్ద సంచలనంగా మారింది.

నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, క్రిష్ణ, వినయ్, బసవర రాజు, ప్రకాష్ ఇలా చాలా మారుపేర్లతో ఉద్యమాన్ని నడిపారు. 2018 నవంబర్‌లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా అనంతరం కేశవరావు మావోయిస్టు సుప్రీం కమాండర్ అయ్యారు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామం.

1984లో ఎంటెక్‌ చదువుతున్నప్పుడు సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ గ్రూపు సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులై...చదువుకు స్వస్తి చెప్పి మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి 43 ఏళ్లుగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు ఉద్యమంలో చేరాక స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదు. మావోయిస్టు మొదటి చీఫ్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా తర్వాత ఆ బాధ్యతలను 2016 లో నంబాల స్వీకరించారు.

దేశవ్యాప్తంగా జరిగిన అనేక కీలక దాడుల్లో బసవరాజు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అయితే నంబాల సమాచారం పక్కాగా తెలుసుకున్న భద్రతా దళాలు… వ్యూహాత్మకంగానే మట్టుబెట్టాయి. ఆయన పార్థివదేహాన్ని కూడా కుటంబ సభ్యులకు ఇవ్వలేదు. ఛత్తీస్ ఘడ్ లోనే అంత్యక్రియలను నిర్వహించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.