Flights Cancelled: ఏపీలో నిలిచిన విమానాల రాకపోకలు
Flights Cancelled: మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
Flights Cancelled: మిచాంగ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలోని రన్‌వే పైకి సోమవారం వరద నీరు చేరింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, కలబురగి, బెంగళూరు నుంచి ఇక్కడకు రాకపోకలు సాగించే సర్వీసులు రద్దుచేశారు. మరికొన్ని దారి మళ్లించారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం పలు సర్వీసులు రద్దయ్యాయి. ఉదయం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, మధ్యాహ్నం తిరుపతి, కడప, హైదరాబాద్, బెంగళూరు సహా రాత్రికి రావాల్సిన విమానాలను వాతావరణ మార్పుల కారణంగా సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ సర్వీసులతో పాటు రాత్రి 8.10 గంటలకు వెళ్లే ఎయిర్ ఇండియా సర్వీసులే నడుస్తాయని అధికారులు తెలిపారు.
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఏడు విమానాల రాకపోకలు నిలిపివేసినట్లు విమానయాన సంస్థ, అథారిటీ వర్గాలు తెలిపాయి. విశాఖపట్నం నుంచి చెన్నై, హైదరాబాద్, గోవా, బెంగళూరు, దిలీ,తిరుపతి, విజయవాడ విమానాల రాకపోకలను తాత్కాలికంగా రద్దుచేశారు. మంగళవారం కూడా 19 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు.
మంగళవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో విమానాలను దారి మళ్లిస్తున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.