Ganji Chiranjeevi: మంగళగిరిలో టీడీపీకి ఎదురు దెబ్బ.. వైసీపీలోకి గంజి చిరంజీవి-mangalagiri tdp leader ganji chiranjeevi joined in ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Mangalagiri Tdp Leader Ganji Chiranjeevi Joined In Ysrcp

Ganji Chiranjeevi: మంగళగిరిలో టీడీపీకి ఎదురు దెబ్బ.. వైసీపీలోకి గంజి చిరంజీవి

B.S.Chandra HT Telugu
Aug 29, 2022 01:10 PM IST

Ganji Chiranjeevi into ysrcp: తెలుగుదేశం పార్టీకి మంగళగిరిలో గట్టి దెబ్బ తగిలింది. గత కొంత కాలంగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.

వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి
వైసీపీలో చేరిన టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి

తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకుడు గంజి చిరంజీవి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. 2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గంజి చిరంజీవి కేవలం 12 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా నారా లోకేష్‌ మంగళగిరి నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా గంజి చిరంజీవి వైసీపీలోకి చేరిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

మంగళగిరిలో బలమైన సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నారు.బలమైన ఆర్ధిక నేపథ్యం ఉండటంతో ఆయన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలి కాలంలో పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆ‍యన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు వారాల క్రితం తనను పార్టీలో ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆరోపించార. టీడీపీ నేతలతో తాడోపేడో తేల్చుకుంటానని కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఆర్కే, గంజి చిరంజీపై కేవలం 12 ఓట్లు మాత్రమే ఆధిక్యం సాధించారు. 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌ మీద ఆర్కే 5337 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.

నారా లోకేష్‌తో పోలిస్తే గంజి చిరంజీవికి స్థానికంగా పట్టుంది. సామాజిక సమీకరణలతో పాటు, స్థానికుడు కావడంతో ఆ‍యనకు సొంత ఓటు బ్యాంకు ఉంది. మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కోసం గంజి చిరంజీవి స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. 2024కూడా ఆ‍యనకు టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడం, పార్టీలో పనిచేస్తున్నా తగిన గుర్తింపు లేకపోవడంతో ఆయన పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

గంజి చిరంజీవి పార్టీని వీడి వైసీపీలో చేరడం వెనుక పక్కా వ్యూహం ఉందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సత్తెనపల్లి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. రెండు సార్లు మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆర్కే మూడో సారి నియోజక వర్గం మార్చుకునే యోచనలో ఉన్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ కు పోటీగా గంజి చిరంజీవిని బరిలోకి దింపుతారనే ప్రచారం జరుగుతుంది. గంజి చిరంజీవి, నారా లోకేష్‌ మధ్య పోటీ అనివార్యమైతే మంగళగిరి రాజకీయం రసవత్తరంగా సాగుతుంది

WhatsApp channel

టాపిక్